తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్వ‌హించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి ముఖ్య‌మంత్రి కేసీఆర్ మేన‌ల్లుడు, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావుకు ఆహ్వానం అందని సంగ‌తి తెలిసిందే. త‌న‌కు ప్ర‌త్యేక ప్రాధాన్యం ద‌క్క‌న‌ప్ప‌టికీ...కాళేశ్వరం ప్రాజెక్టు కోసం తాము పడిన కష్టాన్ని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు సిద్ధిపేటలో ప్రజలకు వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవ సంబురాల్లో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గట్టిగా పట్టుబట్టారు కాబట్టే.. ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కాళేశ్వరం ప్రాజెక్టుకోసం పగలు, రాత్రి కష్టపడి పనిచేశారు కాబట్టే మూడేళ్లలో ఈ అద్భుతం ఆవిష్కారం అయిందని హరీష్ రావు అన్నారు.  
అయితే, హ‌రీష్ రావుపై కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సెటైర్లు వేశారు. త‌న‌కు ఆహ్వానం అంద‌క‌పోవడంతో హ‌రీష్‌రావు బాధపడుతున్నారని.. ఆ బాధలో కాంగ్రెస్‌పై విమర్శలు చేస్తున్నారని  అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్‌పై ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. '30 ఏళ్లలో ఏ ప్రాజెక్టూ నిర్మించలేదని హరీష్‌ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. ఆయన నీళ్లు తాగిన సింగూరు, మంజీరా ప్రాజెక్టులు నిర్మించింది కాంగ్రెస్‌ కాదా?' అని ప్రశ్నించారు. కల్వకుర్తి, నెట్టంపాడు, ఎల్లంపల్లి, జూరాల, దేవాదుల ప్రాజెక్టులను నిర్మించింది కాంగ్రెస్సేనని జగ్గారెడ్డి అన్నారు. 'కాంగ్రెస్ ఏ ప్రాజెక్ట్ కట్టిందో..నీకు తెలియకపోతే మీ మామని అడిగి తెలుసుకో..' అని హరీష్‌రావుకు ఆయన సూచించారు. కేసీఆర్ మెప్పుకోసం కాంగ్రెస్‌పై హరీష్‌రావు ఆరోపణలు చేస్తున్నారని ఆయన అన్నారు.
కాగా, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులో భాగస్వామ్యమై పనిచేయడం గొప్పగా అనిపిస్తోందనీ.. ఈ జన్మకు ఇంకా ఏదో కావాలని తనకు లేదని హరీష్ రావు అన్నారు . జీవితంలో ఓ మంచి పనిచేయగలిగాం.. అంతకంటే గొప్ప ఆనందం మరొకటి ఉండదని .. ఇది తన పూర్వజన్మసుకృతంగా భావిస్తున్నా అని హరీష్ రావు అన్నారు. కాంగ్రెస్ పార్టీ చేయ‌లేని ప‌నిని ముఖ్యమంత్రి కేసీఆర్ చేశార‌ని అభినందించారు. కేసీఆర్  ఆలోచన.. ఇంజినీర్ల కష్టం.. భూనిర్వాసితుల త్యాగఫలమే కాళేశ్వరం ప్రాజెక్టు అని అన్నారు హరీష్ రావు.


మరింత సమాచారం తెలుసుకోండి: