టీడీపీ రాజ్యసభ పక్షం మొత్తం బీజేపీలో కలిసి పోయింది. ఈ యవ్వారం చూసిన వారెవ్వరు కూడా బాబుగారి మీద, టీడీపీ పార్టీ మీద ఎవరు కూడా జాలి చూపించలేదు. కారణమేమిటంటే అందరికి తెలిసిందే. చెడపకురా .. చెడేవు అన్నారు పెద్దలు. ఈ సామెత బాబుగారికి సరిగ్గా సరిపోతుంది. ఆ పార్టీ నుంచి నలుగురు ఎంపీలు జంప్ అన్నా, పైగా అదంతా చట్టబద్దమే అన్నా, దీని పట్ల ఎటువంటి నిరసనా లేదు, సానుభూతి అంతకన్నా లేదు. ఎందుకుని? ఇధంతా చంద్రబాబు స్వయంకృతాపరాధం కనుక. దీనికి చాలా కారణాలు వున్నాయి.


అసలు ఇలాంటి ఫిరాయింపులు గడచిన అయిదేళ్లుగా భయంకరంగా ప్రోత్సహించింది చంద్రబాబే. ఫిరాయించిన వారి రాజీనామాలు తూతూ మంత్రంగా అలావుంచి, వారిలో కొందరిని మంత్రులుగా కూడా చేసిన ఘనత చంద్రబాబుదే. ఈ విషయంలో జగన్ మోహన్ రెడ్డి, వైకాపా ఎంత గోలపెట్టినా, స్పీకర్ పట్టించుకోలేదు. మరి ఇప్పుడు ఇదే సంఘటన బాబు విషయంలో జరిగితే ఎవరు మాత్రం ఎందుకు స్పందిస్తారు?


ఇంకా చిత్రమేమిటంటే... అసలు ఆ నలుగురు వాళ్ల అంతట వాళ్లు వెళ్లలేదు, చంద్రబాబే పంపేసారు అన్న టాక్ రావడం. దీనికి కూడా కారణం చంద్రబాబే. ఇలాంటి టక్కు టమార విద్యలు ఆయన గతంలో అనేకం ప్రదర్శించారు. పైగా ఎన్నికలు అయిపోయి, ఫలితాలు వచ్చేసిన తరువాత, తూచ్.. తమకు యూపీఏతో ఏనాడూ సంబంధం లేదు, ఎన్డీఎను ఏమాటా అనేదిలేదు అంటూ చటుక్కున యూటర్న్ తీసుకునే ప్రయత్నం చేసారు. మరి అలాంటి నేపథ్యంలో యూపీఏ ఎందుకు బాబుకు సపోర్టుగా వస్తుంది? ఇదంతా ఎన్డీఎకు దగ్గర కావడం కోసం బాబు ఆడుతున్న నాటకమే అని అనుకుంటున్నారు జనాలు.  

మరింత సమాచారం తెలుసుకోండి: