తెలుగుదేశం పార్టీకి షాకిస్తూ రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, టీజీ వెంకటేష్‌, సీఎం రమేష్‌లు ఆ పార్టీకి గుడ్‌బై చెప్పిన సంగ‌తి తెలిసిందే. బీజేపీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ న‌డ్డా స‌మ‌క్షంలో వారు బీజేపీ కండువా క‌ప్పుకొన్న అనంత‌రం ఆ పార్టీ రాజ్య‌స‌భా ప‌క్షం విలీనం అయిన సంగ‌తి తెలిసిందే. పార్టీ మారిన ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌, టీజీ వెంకటేష్‌, గరికపాటి మోహనరావులు లేఖ రాయడంతో.. రాజ్యసభలోని తెలుగుదేశం లెజిస్లేచర్ పార్టీని బీజేపీలో విలీనానికి రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడు ఆమోద ముద్ర వేశారు. అయితే, ఈ ఎపిసోడ్‌లో వెంక‌య్య నాయుడు వ్యాఖ్య‌లు, పాత్ర చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

 

 

కొద్దికాలం క్రితం వెంక‌య్య‌నాయుడు ఓ స‌మావేశంలో మాట్లాడుతూ పార్టీ మారి ఇత‌ర పార్టీలో చేరిన ప్ర‌జాప్రతినిధుల స‌భ్యత్వం వెంట‌నే పోయేలా చ‌ట్టాలుండాల‌ని వ్యాఖ్యానించారు. ఏపీలో చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో అక్ర‌మ పార్టీ ఫిరాయింపుల గురించి ఏనాడూ స్పందించ‌ని వెంక‌య్య‌నాయుడు, ఆ ఎన్నిక‌లు పూర్త‌యి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌భుత్వం అధికారంలోకి రావ‌డం...ఇటు తెలంగాణ‌లో టీఆర్ఎస్ ప్ర‌భుత్వం జంపింగ్‌ల‌ను ప్రోత్స‌హిస్తున్న స‌మ‌యంలో ఈ కామెంట్లు చేశారు. అయితే, వెంక‌య్య కామెంట్లను అంతా స్వాగ‌తించారు. కానీ అదే ఉప‌రాష్ట్రప‌తి, రాజ్య‌స‌భ చైర్మ‌న్ ఇప్పుడు పార్టీ మారిన ఎంపీల‌ను విలీనం చేసేస్తూ..ఎంచ‌క్కా వారి ప‌ద‌వుల‌ను సైతం కొన‌సాగించేలా నిర్ణ‌యం ఈసుకోవ‌డంతో...నీతులు ఎదుటి వారికి చెప్పేందుకేనా అని ప‌లువురు ప్ర‌శ్నిస్తున్నారు. 

 

ఇదిలాఉండ‌గా, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ ఛైర్మన్ వెంకయ్యనాయుడును టీడీపీ ఎంపీలు కలిశారు. టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయాలంటూ ఎంపీలు సుజనా చౌదరి, సీఎం రమేష్‌, గరికపాటి మోహన్‌రావు, టీజీ వెంకటేష్‌లు ఇచ్చిన లేఖ చెల్లదని వారు అభిప్రాయపడ్డారు. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం ఆ నలుగురు ఎంపీలై అనర్హత వేటు వేయాలని కోరారు. అయిన‌ప్ప‌టికీ వారిపై చ‌ర్య‌లు లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: