నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు ప్రారంభోత్సవం సందర్భంగా అప్పటి ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ మాట్లాడుతూ భారీ సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలు అంటూ పేర్కొన్న సంగతి తెలిసిందే. నెహ్రూ మాటలను నిజం చేస్తూ కాళేశ్వరం ప్రాజెక్టు ఆధునిక దేవాలయంగా ప్రసిద్ధి చెందనుంది. దక్షిణ గంగగా పేరున్న గోదావరిని పంట పొలాలకు తరలించేందుకు ముక్కంటి మహదేవపూర్‌ మండలాన్ని ఇచ్చాడు. ప్రతి సంవత్సరం వ థాగా సముద్రంలో కలుస్తున్న వేలాది టీఎంసీల్లో కొంతైనా ఒడిసి పట్టుకుని పంట పొలాల్లోకి ప్రజల లోగిళ్లలోకి తీసుకువచ్చి వారి కష్టాలను దూరం చేయడమే కాళేశ్వరం ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం. 

 మూడు నదులు సంగమించే ప్రదేశంగా, కాళేశ్వరానికి ఆధ్యాత్మిక కేంద్రంగా ఇంత కాలం పేరుంది. ఇప్పుడు కాళేశ్వరం సిగలో ఆధునిక దేవాలయం కొలువుతీరింది. దాని పేరే కాళేశ్వరం ఎత్తి పోతల పథకం. ఆ ప్రాజెక్టు మొదలైన తర్వాత కాళేశ్వరం ఆధ్యాత్మిక, ఆధునిక దేవాలయాల నిలయంగా మారింది. ఒకప్పుడు భక్తులతో కిటకిటలాడిన ఈ ప్రాంతం ఇప్పుడు భారీ యంత్రాలకు అడ్డాగా మారింది. ఆధ్యాత్మిక కాళేశ్వరుడు మనశ్శాంతితో ప్రజలకు అభయం ఇస్తే..... ఈ ఆధునిక కాళేశ్వరుడు తెలంగాణ ప్రజలకు సాగు, తాగు నీటి కష్టాలను దూరం చేసేలా అండగా నిలవనున్నాడు.

పురాతన కాలం నుంచి ఆథ్యాత్మిక కేంద్రంగా కాళేశ్వరానికి పేరుంది. భవిష్యత్‌లో కాళేశ్వరం గొప్ప పర్యాటక ప్రాంతంగా కానుందనే అంచనాలు ఉన్నాయి. ప్రాజెక్టు పనులు మొదలు పెట్టినప్పటి నుంచి సుమారు 5లక్షలకుపైగా సందర్శకులు సందిర్శంచినట్లు ఇంజనీర్ల అంచనా. మూడేళ్లుగా నిర్విరామంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో తలమునకలై ఉన్న ఇంజనీర్లు, కార్మికులు ఆపదల్లో శివుడిని దర్శించుకోవడం ఆనవాయితీగా మారిందని చెబుతారు.
 


మరింత సమాచారం తెలుసుకోండి: