ఏపీలో ఆస‌క్తిక‌ర‌మైన ట్రెండ్ క‌నిపిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల జ‌రిగిన ఎన్నిక‌ల్లో ఒక్క‌టంటే...ఒక్క ఎంపీ, ఎమ్మెల్యే సీటును భార‌తీయ జ‌న‌తాపార్టీ గెలుచుకోని సంగ‌తి తెలిసిందే. అలాంటి పార్టీలోకి న‌లుగురు ఎంపీలు చేరారు. ఇంకొంద‌రు ఎంపీలు లైన్లో ఉన్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉన్న‌ప్ప‌టికీ... స్వ‌ల్ప‌కాలంలోనే ఏపీలో ఏం జ‌రిగింది?  బీజేపీ వైపు నేత‌లు ఎందుకు క్యూ క‌డుతున్నారు? అంటే వైసీపీ అధినేత, ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి కార‌ణ‌మ‌ని ప‌లువురు అంటున్నారు.


బీజేపీలో చేరిన న‌లుగురు ఎంపీల‌కు తోడుగా ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన కాపు సామాజికవర్గ తాజా మాజీలు సైతం బీజేపీ వైపు చూస్తున్నార‌ని అంటున్నారు. భవిష్యత్‌పై ఆందోళ‌న పట్టుకున్న ఈ నేత‌లంతా రామచంద్రపురం మాజీ ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు నాయకత్వంలో కాకినాడలోని ఓ హోటల్‌లో సమావేశమయ్యారు. జ్యోతుల నెహ్రూ, వరుపుల రాజా, మీసాల గీత, మాధవ నాయుడు, ఈలి నాని, పంచకర్ల రమేష్‌బాబు, బోండా ఊమ, బడేటి బుజ్జి, బూరగడ్డ వేదవ్యాస్‌, కదిరి బాబూరావు, చెంగల్రాయుడు తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  తెలుగుదేశం భవిష్యత్‌పై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో ఉంటే తమక్కూడా భవిష్యత్‌ ఉండదని ఆవేదన చెందారు. ప్రత్యామ్నాయం చూసుకోవాల్సిన అవసరాన్ని వీరంతా ఒకరికొకరు నొక్కి చెప్పుకున్నారు. 


సుమారు మూడుగంటలకు పైగా ఈ సమావేశం సాగింది. ఇందులో తొలుత వైకాపాలోకెళ్తే కలిగే ప్రయోజనాలపై చర్చించారు. అయితే ఆయా నియోజకవర్గాల్లో వైకాపా ఎమ్మెల్యేలుండడంతో తమకెలాంటి ప్రాతినిధ్యం లభించదని తేల్చేశారు. రానున్న ఎన్నికల నాటికి కూడా తెలుగుదేశం తిరిగి కోలుకునే అవకాశాల్లేవని అభిప్రాయపడ్డారు. పార్టీ నాయకత్వ సంక్షోభంలో కూరుకుపోతుందని ఒకరిద్దరు తాజా మాజీలు పేర్కొన్నారు. బీజేపీ ఒక్కటే ప్రత్యామ్నాయమని కృష్ణా జిల్లాకు చెందిన ఓ తాజామాజీ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ వరకు బీజేపీ అధికారంలోకొచ్చే అవకాశాల్ని ఆశించలేమని కొందరు చెప్పుకొచ్చారు. దీంతో పరిస్థితి తిరిగి మొదటికొచ్చింది. ఈ విషయంలో మరింత లోతుగా చర్చించాల్సిన అవసరముందని ఈ సమావేశం అభిప్రాయపడింది. మరోసారి విశాఖలో కలుసుకోవాలని తీర్మానించింది.


ఈ చ‌ర్చ వెనుక ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి కార‌ణ‌మ‌ని అంటున్నారు. రాష్ట్ర శాసనసభకు ఎన్నికైన వారిలో 10మంది వరకు పక్క చూపులు చూస్తున్నట్లు ఎన్నికల ఫలితాలు వెలువడినప్పటి నుంచే ప్రచారం జరుగుతోంది. నిండు శాసనసభలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన రెడ్డి ఇదే విషయాన్ని ప్రస్తావించడంతో జరుగుతున్న ప్రచారానికి బలం చేకూరింది. ఒక వేళ‌ అధికార వైసీపీలో చేరేందుకు ఎవ‌రైనా ముందుకు వ‌స్తే...రాజీనామా చేయాల్సిందేనంటూ ముఖ్యమంత్రి జగన్మోహన రెడ్డి స్పష్టం చేశారు. దీంతో జంపింగ్ నేత‌ల్లో క‌ల‌వ‌రం మొద‌లైంద‌ని అంటున్నారు. ఇప్పటికిప్పుడు రాజీనామా చేసి ఎన్నికల్లోకి వెళ్లేందుకు ఇష్టం లేని స్థితిలో బీజేపీలో చేరి ప్రత్యేక గ్రూపుగా గుర్తించాలంటూ కోరే అవకాశాలు ఉన్నట్లు రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఇలా జ‌గ‌న్ పాటించే ఉన్న‌త రాజ‌కీయ విలువ‌లు బీజేపీకి ఊహించ‌ని రీతిలో మేలు చేశాయంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: