అగ్ర‌రాజ్యం అమెరికా, ఇస్లామిక్ దేశం ఇరాన్ మ‌ధ్య యుద్ధ‌మేఘాలు క‌మ్ముకుంటున్నాయి. ఇటీవ‌ల రెండు దేశాల మ‌ధ్య యుద్ధ వాతావ‌ర‌ణం నెల‌కొన్న విష‌యం తెలిసిందే. అమెరికాకు చెందిన నిఘా డ్రోన్‌ను ఇరాన్ పేల్చేసింది. హార్మోజ్‌గాన్ ప్రావిన్సులోకి ప్ర‌వేశించిన డ్రోన్‌ను ఇరాన్‌కు చెందిన రెవ‌ల్యూష‌న‌రీ గార్డ్స్ కార్ప్స్ కూల్చేసిన‌ట్లు తెలిపారు. కౌమోబార‌క్ జిల్లాలో ఇరాన్ గ‌గ‌న‌త‌లంలోకి ప్ర‌వేశించిన త‌ర్వాత డ్రోన్‌ను పేల్చేసిన‌ట్లు తెలుస్తోంది. ఆర్‌క్యూ-4 గ్లోబ‌ల్ హాక్ డ్రోన్‌ను కూల్చిన‌ట్లు ఇరాన్ న్యూ ఏజెన్సీ ప్ర‌క‌టించింది. అయితే డ్రోన్ కూల్చివేత వార్త‌ల‌ను అమెరికా ఖండించింది. యూఎస్ సెంట్ర‌ల్ క‌మాండ్ ప్ర‌తినిధి కెప్టెన్ బిల్ అర్బ‌న్ ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. ఇరాన్ గ‌గ‌న‌త‌లంలోకి ఎటువంటి డ్రోన్ ప్ర‌వేశించ‌లేద‌ని ఆయ‌న అమెరికా వార్త సంస్థ‌కు తెలిపారు. 


గ‌త ఏడాది కాలం నుంచి అమెరికా, ఇరాన్ మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. 2015లో న్యూక్లియ‌ర్ డీల్ నుంచి ట్రంప్ త‌ప్పుకోవ‌డంతో రెండు దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త పెరిగింది. ఇటీవ‌ల గ‌ల్ప్ ఆఫ్ ఒమ‌న్‌లో ఇంధ‌నంతో వెళ్తున్న నౌక‌ల‌ను ఇరాన్ పేల్చేస్తున్న‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో అమెరికా ఆ ప్రాంతానికి ప్ర‌త్యేక బల‌గాల‌ను కూడా పంపించింది. ఆ త‌ర్వాతే ఈ డ్రోన్ ఘ‌ట‌న చోటుచేసుకుంది.అయితే, డ్రోన్‌ను కూల్చివేసిన ఘ‌ట‌న‌కు ప్ర‌తీకారంగా ఇరాన్‌పై అమెరికా దాడి చేయాల‌నుకుంది. దానికి అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్ గ్రీన్ సిగ్న‌ల్ కూడా ఇచ్చారు. కానీ మ‌ళ్లీ త‌న నిర్ణ‌యాన్ని ట్రంప్ వెన‌క్కి తీసుకున్నారు. 


ఇరాన్‌పై సైనిక దాడికి అమెరికా ప్లాన్ వేసింది. శుక్ర‌వారం తెల్ల‌వారుజామున ఈ దాడి చేయాల‌ని ముందుగా ప్లాన్ వేశారు. రాడార్‌, మిస్సైల్ స్థావ‌రాల‌ను టార్గెట్ చేయాల‌ని భావించారు. అయితే సీనియ‌ర్ అధికారులు ఈ అంశంలో జోక్యం చేసుకుని దాడిని నివారించిన‌ట్లు తెలుస్తోంది. విమానాల‌ను గ‌గ‌న‌త‌లంలో.. నౌక‌ల‌ను స‌ముద్రంలో స‌మాయ‌త్తంగా ఉంచిన‌ట్లు అధికారులు చెప్పారు. కానీ ఎటువంటి మిస్సైళ్ల‌ను ఫైర్ చేయ‌లేదు. అయితే త‌మ డ్రోన్ కూల్చివేత‌ను ప్ర‌మాద‌వ‌శాత్తు జ‌రిగిన ఘ‌ట‌న‌గా ట్రంప్ పేర్కొన‌డం గ‌మ‌నార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: