ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయిన తరువాత  2014లో నవ్యాంధ్రప్రదేశ్ కు జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార పక్షం టీడీపీ చేతిలో ఓడిపోయిన తరువాత వైసిపి పార్టీ అధినేత జగన్, అప్పటినుండి పార్టీని ప్రజలకు ఏ విధంగా చేరువ చేయాలి, అలానే ప్రజల పక్షాన నిలబడి అధికార పక్షం చేపట్టని కార్యక్రమాలపై ఏ విధంగా ప్రశ్నించాలి వంటి అంశాలను బలంగా ముందుకు తీసుకెళ్లారని చెప్పాలి. అంతేకాక మధ్యలో ఏడాదికి పైగా ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు అయన ప్రజాసంకల్పయాత్ర ను కూడా చేపట్టి వారి సమస్యలను నిశితంగా తెలుసుకున్నారు. అయితే తనకు ఆ యాత్రతో ప్రజల బాధలు, వారు ఎదుర్కొంటున్న సమస్యలను మరింత లోతుగా తెలుసుకోవడం జరిగిందని, తాను అధికారంలోకి వస్తే ముందుగా ప్రజాసంక్షేమంపైనే దృష్టిపెడతామని అప్పట్లో జగన్ చెప్పారు. 

అంతేకాక అదే సమయంలో పార్టీలోని వారందరితో ఎన్నోరోజులు సంప్రదింపుల తరువాహత 9 ముఖ్యమైన అంశాలతో కూడిన నవరత్నాలు అనే కాన్సెప్ట్ ని ప్రజల ముందుకు తీసుకురావడం జరిగింది. ఇక ఆ నవరత్నాలను తన ప్రచారంలో భాగంగా చేసుకుని, వెళ్లిన ప్రతిచోటా నవరత్నాల గురించి మాట్లాడిన జగన్, అధికారం వచ్చాక దానిని అమలు చేయడమే తన మొదటి విధి అని చెప్పుకొచ్చారు. ఇక అనుకున్నట్లుగా 2019లో ఎన్నికలు రావడం ఆపై వైసిపి పార్టీ అత్యధిక మెజారిటీతో విజయం సాధించడం జరిగిపోయాయి. అయితే ముఖ్యమంత్రి అయిన తరువాత జగన్ తన మొదటి సంతకాన్ని కూడా నవరత్నాలలో మొదటిదైన సామజిక పెన్షన్ల పెంపు ఫైల్ పై పెట్టడం జరిగింది. ఇక సచివాలయంలోని తన ఛాంబర్ లో నవరత్నాల పోస్టర్లను ఏర్పాటుచేసుకున్న జగన్, దానిని ఒక భగవత్గీత, బైబిల్, ఖురాన్ లా భావిస్తాను అని ఇటీవల చెప్పడం జరిగింది. అయితే నవరత్నాల్లో దాదాపుగా అన్ని పధకాలు అమలు చేయవచ్చని, కానీ అందులో పొందుపరిచిన మద్యనిషేధం అంశాన్ని మాత్రం పూర్తిగా అమలుచేయలేరని ఇప్పటికే ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్న విషయం తెలిసిందే. 

ఎందుకంటే రాష్ట్రానికి అత్యధిక ఆదాయ మార్గాల్లో మద్యం కూడా ఒకటి కావడం, అదీకాక మద్యనిషేధం అమలు చేయాలంటే అన్ని స్థాయిల్లోనూ, అందరిలోనూ ఎటువంటి వ్యతిరేకత రాకుండా చూసుకోవడం చాలా వరకు కష్టమైనా పనే. అయితే తాము మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగా కొన్ని దశలవారీగా మెల్లగా మద్యనిషేధాన్ని ప్రారంభించి, రాబోయే ఐదేళ్లలో మద్యాన్ని అవకాశం ఉన్నంతవరకు ఫైవ్ స్టార్ హోటళ్లకే పరిమితం చేసేలా చట్టాలు తెస్తాం అంటున్నారు జగన్. ఇక దీనిపై రాజకీయ విశ్లేషకులు చెపుతున్న మాట ఏంటంటే, నవరత్నాలలో ఈ ముఖ్యమైన మద్యనిషేధ పధకాన్ని కనుక జగన్ గారు పూర్తి స్థాయిలో అమలు చేయగలిగితే రాబోయే ఎన్నికల్లో ఆయనకు అది బాగా కలిసివచ్చే అంశం అవుతుంది అనడంలో అనుమానమే లేదంటున్నారు....!!   


మరింత సమాచారం తెలుసుకోండి: