జగన్మోహన్ రెడ్డి ఔధార్యం వల్ల క్యాన్సర్ పేషంట్ నీరజ్ కుమార్ క్రమంగా కోలుకుంటున్నారు. ఆమధ్య శారధా పీఠానికి వెళ్ళేందుకు జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నం ఎయిర్ పోర్టులో దిగారు గుర్తుందా ? విమానాశ్రయం నుండి బయటకు రాగానే కొందరు తమ మిత్రుడిని కాపాడమంటూ పెద్ద బ్యానర్ పట్టుకుని నినాదాలు చేశారు. తమ మిత్రుడు నీరజ్ కుమార్ క్యాన్సర్ తో బాధపడుతున్నాడని పెద్ద మొత్తంలో సాయం చేస్తేకానీ బతకడంటూ నినాదాలు చేశారు.

 

వీళ్ళు పట్టుకున్న బ్యానర్, వీళ్ళ నినాదాలను గమనించిన జగన్ వెంటనే వాళ్ళని తమ దగ్గరకు పిలిపించుకున్నారు. విషయమంతా తెలుసుకున్నారు. అక్కడికక్కడే నీరజ్ చికిత్స కోసం రూ 25 లక్షలు సాయం ప్రకటించారు. అంతేకాకుండా ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడి చికిత్సకయ్యే మొత్తం వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇప్పించారు.

 

రోజువారి కూలీ చేసుకునే నీరజ్ తల్లి దండ్రులు కొడుకు చికిత్సకయ్యే ఖర్చును చూసి ఆశలు వదిలేసుకున్నారు. డబ్బులు చెల్లించలేకపోతే తాము కూడా ఏమీ చేయలేమని ఆసుపత్రి వర్గాలు కూడా తేల్చి చెప్పాయి. రోజులు లెక్కపెట్టుకుంటున్న నీరజ్ కోసం మిత్రులు ధైర్యం చేసి జగన్ దృష్టిని ఆకర్షించారు.

 

సీన్ కట్ చేస్తే స్వయంగా సిఎంవోనే హామీ ఇవ్వటంతో నీరజ్ కు ఆసుపత్రి వర్గాలు చికిత్స మొదలుపెట్టింది. నీరజ్ కూడా క్రమంగా కోలుకుంటున్నారు. ఒకపుడు కృత్రిమంగా ఆక్సిజన్ తీసుకునే విద్యార్ధికి ఇపుడు ఆ అవసరం రావటం లేదు. ఒకపుడు ట్యూబ్ ద్వారా తప్ప ఆహారం తీసుకునే నీరజ్ ఇపుడు మామూలుగానే ఆహారం తీసుకుంటున్నాడు. ఒకపుడు బాగా బక్కచిక్కిపోయిన నీరజ్ ఇపుడు బాగా కోలుకుంటున్నాడట.

 

ఆసుపత్రి యాజమాన్యంతో మాట్లాడిన సిఎంవో నీరజ్ చికిత్సకయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇవ్వటమే కాకుండా ఇప్పటికే రూ 10 లక్షలు చెల్లించింది. డబ్బుకు సంబంధించిన ఏ అంశమైనా తమతోనే నేరుగా మాట్లాడమని కూడా సిఎంవో అధికారులు స్పష్టమైన ఆదేశాలిచ్చారు. దాంతో ఖర్చులతో సంబంధం లేకుండా నీరజ్ కు అత్యుత్తమైన చికిత్స అందుతోంది. అందుకనే నీరజ్ కూడా తొందరగా కోలుకుంటున్నాడు. మొత్తానికి తమ కళ్ళముందే జరిగిన అద్భుతాన్ని చూసిన వాళ్ళంతా జగన్ కు హ్యాట్సాఫ్ చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: