చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పిచాలని కోరుతూ రాజ్యసభలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టిన ప్రైవేటు మెంబర్ బిల్లుపై సుదీర్ఘ చర్చ జరిగింది. ఈ బిల్లును ప్రవేశపెట్టినందుకు గాను విజయసాయిరెడ్డికి పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల నాయకులు అభినందించారు. చట్ట సభల్లో బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ రాజ్యాంగంలోని ఆర్టికల్‌లోని 330(ఎ), 332(ఎ) సవరించాలని కోరుతూ గతంలో ప్రైవేటు మెంబరు బిల్లును విజయసాయిరెడ్డి ప్రవేశపెట్టారు.

 

ఈ బిల్లుపై విజయసాయిరెడ్డి మాట్లాడుతూ దేశంలో అత్యధికంగా ఉన్న బీసీలకు తగిన విధంగా ప్రజా ప్రతినిధులు చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. దేశంలో 50 శాతం ఉన్న జనాభా తగిన విధంగా చట్ట సభల్లో రిజర్వేషన్లు కల్పించాలని ఆయన కోరారు. ప్రస్తుత లోక్‌సభలో బీసీల 20 శాతం కన్నా తక్కువ మంది ప్రతినిధ్యం వహించడం ఆందోళన కల్గిస్తుందని పేర్కొన్నారు.

 

రాజ్యాంగంలోని ఆర్టికల్ 330, 332 ద్వారా ఎస్సీ, ఎస్టీలకు కల్పిస్తున్న రిజర్వేషన్లు తరహాలోనే బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలన్నారు. దేశ వ్యాప్తంగా 2400పైగా బీసీ కులాలు ఉంటే 1400పై బీసీ కులాలకు ఇప్పటికి సామాజిక, ఆర్థిక వెనుకబాటుకు గురవుతున్నారని ఆయన చెప్పారు. దేశ వ్యాప్తంగా ఉన్న 2200కు పైగా బీసీ కులాలు పార్లమెంట్‌లో గాని రాష్ట్రాల శాసన సభలలో గాని అడుగు పెట్టలేదన్నారు.

 

సామాజిక న్యాయం కోసం ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇటీవల తన మంత్రివర్గంలోకి 60 శాతం బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు స్థానం కల్పించారన్నారు. గతంలో బీసీల కోసం ఖేల్కర్ కమిషన్, మండల్ కమిషన్ వేసినప్పటికి, ఆ నివేదికలలోని అంశాలను అమలు చేయలేదని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీలపై జరిగే అత్యాచారాలను నిరోధించడానికి చట్టాన్ని ఏర్పాటు చేసినట్టే, బీసీలపై జరుగుతున్న దాడులను, అత్యాచారాలను నిరోధించడానికి ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని ఆయన కోరారు.


మరింత సమాచారం తెలుసుకోండి: