ముస్లిం మహిళల హక్కుల పరిరక్షణకు సంబంధించిన త్రిపుల్ తలాక్ బిల్లును ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం శుక్రవారం లోక్‌సభలో ప్రతిపాదించింది. న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్రిపుల్ తలాక్ బిల్లును తాజాగా ప్రతిపాదించారు. ఎంఐఎం సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ మేరకు ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్‌సభలో ప్రతిపాదించేందుకు అనుమతించాలా? వద్దా? అనే అంశంపై ఓటింగ్ జరుగగా కేవలం 74 మంది మాత్రమే బిల్లు ప్రతిపాదన అనుమతికి వ్యతిరేకంగా ఓటు వేశారు.

 

దీనితో రవిశంకర్ ప్రసాద్ తాజా ట్రిపుల్ తలాక్ బిల్లును లోక్‌సభలో ప్రతిపాదించారు. ఏపీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైఎస్సార్‌సీపీ, పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నాయకత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ సభ్యులు ఓటింగ్‌లో పాల్గొనలేదు. ఎన్‌డిఏ మిత్రపక్షమైన బిహార్ ముఖ్యమంత్రి నితీష్‌కుమార్ నాయకత్వంలోని జేడీయూ, ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ నాయకత్వంలోని బీజేడీ ఎంపీలు ట్రిపుల్ తలాక్ బిల్లును వ్యతిరేకించారు.

 

మోదీ ప్రభుత్వం ట్రిపుల్ తలాక్ బిల్లును గత సంవత్సరం డిసెంబర్‌లో లోక్‌సభలో ప్రతిపాదించి ఆమోదించి రాజ్యసభకు పంపించటం తెలిసిందే. అయితే పదహారవ లోక్‌సభ రద్దు కావడం, పదిహేడవ లోక్‌సభ ఏర్పడటంతో ట్రిపుల్ తలాక్ బిల్లును మరోసారి తాజాగా లోక్‌సభలో ప్రతిపాదించవలసి వచ్చింది. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రతిపాదించేందుకు లేచినప్పటి నుండి లోక్‌సభలో గొడవ జరిగింది.

 

న్యాయశాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ ప్రతిపక్షం సభ్యులు లేవనెత్తిన అభ్యంతరాలకు సమాధానం ఇస్తూ ట్రిపుల్ తలాక్ బిల్లు ముస్లిం మహిళల పట్ల జరుగుతున్న వివక్షను అరికడుతుందనీ, వారికి సమాన హక్కులు కల్పిస్తుందని మంత్రి చెప్పారు. ‘అందరి తోడుగా అందరి ప్రగతి, అందరి విశ్వాసం’ అనే తమ విధానానికి అనుగుణంగా ట్రిపుల్ తలాక్ బిల్లును ప్రతిపాదిస్తున్నామని రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. లింగ సమానత్వాన్ని సాధించేందుకు ఈ బిల్లును తెస్తున్నామని ఆయన చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: