నీతి ఆయోగ్ మాజీ సీఈఓ సింధుశ్రీ ఖుల్లర్, మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ మంత్రిత్వ శాఖ మాజీ కార్యదర్శి అనూప్ కే పుజారి, ప్రస్తుతం కొలువులో ఉన్న పలువురు ఉన్నతాధికారులు, రిటైర్డ్ ఉన్నతాధికారుల ప్రాసిక్యూషన్‌కు అనుమతి ఇవ్వాలని సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. వీరంతా పలు అవినీతి కేసుల్లో పాలుపంచుకున్నట్టు ఆరోపణలు ఉన్నాయి.

 

అదేవిధంగా హిమాచల్‌ప్రదేశ్ ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రబోధ్ సక్సేనా, డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకనామిక్ అఫైర్స్ మాజీ అండర్ సెక్రెటరీ రబీంద్ర ప్రసాద్ ఐఎన్‌ఎక్స్ మీడియా కుంభకోణంలో తగిన పాత్ర ఉన్న నేపథ్యంలో వారిని కూడా విచారించేందుకు అనుమతి ఇవ్వాలని అవినీతి నిరోధక శాఖ కోరింది. వివిధ రూ పాల్లో అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయా అధికారులు, రిటైర్డ్ అధికారులను తగిన రీతిలో విచారించేందుకు వీలుగా తమకు అనుమతి ఇవ్వాలని సీవీసీ కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖతోపాటు ఆయా శాఖల మంత్రిత్వ శాఖలకు విజ్ఞప్తి చేసినట్టు సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి.

 

ఈ నేపథ్యం లో ఆయా కేసుల్లో పాత్ర ఉన్నట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారులు, రిటైర్డ్ అధికారులను తమ పరిధిలో విచారించేందుకు అనుమతివ్వాలని సీవీసీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరిందని సంబంధిత అధికార వర్గాలు తెలిపాయి. ఖుల్లర్ 2004, 2008లో డిపార్ట్‌మెంట్ ఎకనామిక్ అఫైర్స్‌లో అడిషనల్ సెక్రెటరీగా పనిచేశారు.

 

సక్సేనా 2008, 2010లో డిపార్ట్‌మెంట్‌లో డైరెక్టర్‌గా పనిచేశారు. ప్రసాద్ సైతం వీరిపై దర్యాప్తు చేస్తున్న సమయంలో ఆదే శాఖలో పనిచేశారని సీవీసీ అధికార వర్గాలు తెలిపాయి. వీరిందరిపై 2017 మే 15న సీబీఐ ఎఫ్‌ఐఆర్ దాఖలు చేసింది. పి.చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్న సమయంలో యూపీఏ ప్రభుత్వ హయాంలో 2007లో ఐఎన్‌ఎక్స్ మీడియాకు విదేశాల నుంచి వచ్చిన కోట్లాది రూపాయల నిధులకు ఎఫ్‌ఐపీబీ క్లియరెన్స్ ఇవ్వడంలో నిబంధనలకు ఉల్లంఘించి వ్యవహరించినట్టు ఆయా అధికారులపై ఆరోపణలు వచ్చినట్టు సీవీసీ వర్గాలు తెలిపాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: