క్షేత్రస్ధాయిలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అందరికీ అలాగే అనిపిస్తోంది. ఎన్నికలు ముగిసిన తర్వాత మళ్ళీ వైసిపి ఎంఎల్ఏల సంఖ్య ఎలా పెరుగుతుంది ?  ఎలాగంటే తొందరలో టిడిపి ఎంఎల్ఏల్లో కొందరు పార్టీ ఫిరాయించేట్లే కనిపిస్తోంది. మరి పార్టీ ఫిరాయించినందుకు ఎంఎల్ఏలపై అనర్హత వేటు పడుతుంది కదా ?

 

ఎప్పుడైతే టిడిపి నుండి ఎంఎల్ఏలు పార్టీ ఫిరాయిస్తారో స్పీకర్ తమ్మినేని సీతారమ్ వెంటనే వాళ్ళపై అనర్హత వేటు వేస్తారనే అనుకుంటున్నారు. నిబంధనల ప్రకారం వాళ్ళపై వేటు వేయాల్సిందే. పైగా తమ పార్టీలో నుండి ఫిరాయించారు కాబట్టి ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలంటూ టిడిపి కూడా స్పీకర్ ను పట్టుబడుతుంది.

 

పార్టీలు ఫిరాయించిన వాళ్ళ విషయంలో జగన్మోహన్ రెడ్డి మొదటి నుండి స్పష్టమైన వైఖరితోనే ఉన్నారు. మొన్నటి  అసెంబ్లీ సమావేశాల్లో కూడా పార్టీ ఫిరాయింపులపై వెంటనే వేటు వేయలంటూ స్పీకర్ ను జగన్ విజ్ఞప్తి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. అనర్హత వేటు పడుతుందని తెలిసినా పార్టీ ఫిరాయించే ఎంఎల్ఏలున్నారా టిడిపిలో ?

 

కాబట్టి ఎంతమంది టిడిపి నుండి ఫిరాయిస్తారో వాళ్ళ సభ్యత్వాలు పోవటం ఖాయంగానే తోస్తోంది. ఎంఎల్ఏలపై అనర్హత వేటు వేసిన తర్వాత అదే విషయాన్ని స్పీకర్ ఎన్నికల సంఘానికి చెబుతారు. దాంతో ఏదో ఓ తేదీన అనర్హత వేటు పడిన ఎంఎల్ఏల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.

 

ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా మళ్ళీ వైసిపి, టిడిపి, బిజెపిలు పోటీ చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఏం చేస్తారో తెలీదనుకోండి. అంటే ఉప ఎన్నికలు ఎప్పుడు జరిగినా విజయం మాత్రం దాదాపు వైసిపిదే అనటంలో సందేహం అవసరం లేదు. సిఎం అయినప్పటి నుండి పాలనలో జగన్ చూపిస్తున్న దూకుడు చూస్తుంటే  ప్రతిపక్షాలకు డిపాజిట్లన్నా దక్కుతాయా ? ఏమో చూడాల్సిందే ?

 


మరింత సమాచారం తెలుసుకోండి: