ఏపీలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఆ పార్టీ వీరాభిమానులు కూడా జీర్ణించుకోలేని స్థితికి దిగజారిపోయింది. ఎన్నికల్లో కేవలం 23 మంది ఎమ్మెల్యేలతో సరిపెట్టుకున్న చంద్రబాబుకు ఇప్పుడు వ‌రుస‌ పెట్టి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే నలుగురు టిడిపికి చెందిన రాజ్యసభ సభ్యులను తమవైపునకు తిప్పుకున్న కాషాయ దళం మరో లోక్‌స‌భ ఎంపీతో పాటు... ఏకంగా 15 మందికి పైగా ఎమ్మెల్యేలను సైతం బీజేపీలో చేర్చుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి ఏపీలో ఎదగాలని భావిస్తున్న బిజెపి టిడిపిని పూర్తిగా భూస్థాపితం చేసి ఆ ప్లేస్‌లోకి వ‌చ్చేయాలని ప్లాన్ చేస్తోంది.  తన ప్రధాన పదవికి ఎసరు పెట్టేందుకు చంద్రబాబు చేసిన విశ్వప్రయత్నాలు మోడీ ఎప్పటికీ మరిచిపోలేరు. 

అందుకే అసలు ఏపీలో టీడీపీ పార్టీని లేకుండా చేస్తాం అన్నట్టుగా మోడీ చంద్రబాబుపై కక్ష గట్టినట్టు బిజెపి చర్యలు స్పష్టం చేస్తున్నాయి. 1995లో చంద్రబాబు ఎన్టీఆర్‌ను గద్దె దింపి పార్టీని హస్తగతం చేసుకున్నా అప్పుడు సైకిల్ గుర్తు బాబుకే వచ్చింది అంటే మెజార్టీ ఎమ్మెల్యేలు ఎవరి వైపు ఉంటే వాళ్లకే పార్టీ సింబల్ ఉండటం సహజం. ఇప్పుడు చంద్ర‌బాబుకు కూడా సైకిల్ గుర్తు లేకుండా చేసేందుకు మోడీ అండ్ కో ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంద‌ట‌. ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు అయినా మూడింట రెండు వంతులకు గాను పార్టీ మారి వేరే పార్టీలో కలుస్తామని స్పీకర్‌కు లేఖ ఇస్తే రాజ్యాంగంలోని పదవ నిబంధన ప్రకారం అది చెల్లుబాటు అవుతుంది. అప్పుడు ఆ ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయింపుల చట్టం పరిధిలోకి రారు. 

ఈ క్రమంలోనే ప్రస్తుతం టీడీపీకి ఉన్న‌ 23 మంది ఎమ్మెల్యేల్లో 16 మంది ఎమ్మెల్యేలు గనుక పార్టీ మారిపోతే అప్పుడు అంతా ఫిరాయింపుల చట్టం నుంచి తప్పించుకున్న వారు అవుతారు. గంటా శ్రీనివాసరావు ఏపీ రాజకీయాల్లో సీనియర్ గా ఉన్నారు. ఆయన గత ఏడు సంవత్సరాల నుంచి మంత్రిగా పని చేస్తున్నారు. ఈ ఎన్నికల్లో కూడా గంట విశాఖ నార్త్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. విశాఖ జిల్లాలో ఉన్న కొంద‌రు ఎమ్మెల్యేలు  గంటా ఏం చెబితే అది చేయటానికి రెడీగా ఉన్నారు. ఇక ఈ ఎన్నికల్లో గెలిచిన కాపు ఎమ్మెల్యేలతోపాటు గంటా వియ్యంకుడు, తాజా మాజీ మంత్రి నారాయణ అంతా కలిసి టీడీపీ నుంచి చీలిపోయే కొత్త ముఠాకు గంటాను నాయకుడిని చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. 

ప్రస్తుతం శ్రీలంకలో విహారయాత్రలో ఉన్నారు. ఆయన అక్కడినుంచి బిజెపి పెద్దలతో టచ్ లోకి వెళ్లినట్లు తెలుస్తోంది. గంటా పార్టీ మారుతున్న‌ట్టు సోష‌ల్ మీడియాలో ఒక్క‌సారిగా వార్త‌లు రావ‌డంతో గంటా వాటిని ఖండించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అయితే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ గొడుకు ప‌ట్టే గంటాను మాట‌ను పూర్తిగా న‌మ్మేందుకు లేదు. ఏదేమైనా గంటాను బీజేపీలోకి తీసుకువ‌చ్చి సామాజిక స‌మీక‌ర‌ణ‌ల ప‌రంగా ఆయ‌న్ను వ‌చ్చే ఎన్నిక‌ల నాటికి ఏపీలో బీజేపీ త‌ర‌పున ఏపీ సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించే ప్ర‌య‌త్నాల్లో బీజేపీ ఉన్న‌ట్టు తెలుస్తోంది. ఏదేమైనా ఏపీ రాజ‌కీయాల్లో పెను మార్పులు ఖాయం కానున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: