తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి విషయంలో కొద్ది రోజుల క్రితం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరికి తెలిందే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత మాజీ పార్లమెంట్ సభ్యుడు వైవీ సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. హిందూ ధార్మిక సంస్థలు, దేవాదాయ చట్టం 1987 ప్రకారం టీటీడీకి కొత్త బోర్డును ఏర్పాటు చేయగా.. టీటీడీ ఛైర్మన్‌గా శనివారం సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. తిరుమల తిరుపతి దేవస్థానాల పాలక మండలి చైర్మన్‌గా ఆళ్వార్‌ సన్నిధిలో వైవీ సుబ్బారెడ్డితో ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్‌ ప్రమాణం చేపించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన వైవీ సుబ్బారెడ్డి.. టీటీడీ అభివృద్ధికి కృషి చేస్తామని, గత ఐదేళ్లలో టీటీడీలో జరిగిన అవినీతిపై విచారణ జరుపుతామని వెల్లడించారు.భక్తులకు అందరికి సేవ చేసే భాగ్యం తనకు కల్పించినందుకు.. సీఎం జగన్‌కు వైవీ కృతజ్ఞతలు తెలిపారు. వసతుల కల్పన, సామాన్య భక్తుని నుంచి ప్రతీ ఒక్కరికి దర్శనం,  ఉద్యోగులకు భద్రత వంటి అంశాలను మెయిన్‌గా ఫోకస్ చేయనున్నట్లు వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు.

టీడీకి వచ్చే డబ్బు స్వామివారికే దక్కాలని, అక్కడ నుంచి అవి పేద ప్రజలకు చేరాలని, అక్రమార్కుల చేతుల్లోకి ఈ డబ్బులు వెళ్లకుండా చేసే బాధ్యత తనపై ఉందని స్పష్టం చేశారు.హిందూ ధర్మ ప్రచారాన్ని కాపాడుకుంటూ టీటీడీ అభివృద్ధికి కృషి చేయాలని ముఖ్యమంత్రి జగన్ తనకు సందేశం ఇచ్చినట్లు వైవీ సుబ్బారెడ్డి చెప్పారు.  త్వరలోనే పాలకమండలి సభ్యుల నియామకాలు కూడా చేపట్టనున్నట్టు ఆయన తెలిపారు. వైవీ సుబ్బారెడ్డి టీటీడీ 50వ ఛైర్మన్‌గా బాధ్యతలు చేపట్టారు.

ఈ కార్యక్రమానికి ఎంపీ విజయసాయి రెడ్డి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణ రెడ్డి, డిప్యూటీ సీఎం నారాయణ స్వామి, మండలి చీఫ్ విప్ ఉమ్మారెడ్డి వేంకటేశ్వర్లు, చీఫ్‌విప్‌ శ్రీకాంత్ రెడ్డి, ఎమ్మెల్యేలు భూమన, రవీంద్రనాథ్ రెడ్డి, జంగాలపల్లి శ్రీనివాసులు, మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి, మాజీ పాలకమండలి సభ్యుడు రౌతు సూర్యప్రకాశరావు, నిర్మాత దిల్ రాజులు హాజరయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి: