గ్రామ– వార్డు వలంటీర్ల నియామకానికి దరఖాస్తులు స్వీకరకణకు శనివారం ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేస్తోంది. వాలంటీర్ల నియామకానికి గ్రామం, మున్సిపల్‌ వార్డును ఒక యూనిట్‌గా తీసుకుంటారు. గ్రామీణ ప్రాంతాలలో మండలంను యూనిట్‌గా ఆ మండల పరిధిలో నియమించే వలంటీర్ల సంఖ్యను లెక్కించి తీసుకొని, ఆ సంఖ్యకు అనుగుణంగా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్స్‌ పాటిస్తారు. ఈ మేరకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్‌ కేటగిరీల ఎంపిక ఉంటుంది. అన్ని విభాగాల్లో దాదాపు సగం మంది మహిళలను నియమిస్తారు.


ఆన్‌లైన్‌ ద్వారా అందిన దరఖాస్తుల స్క్రూటినీ పట్టణ స్థాయిలో మున్సిపల్‌ కమిషనర్, మండల స్థాయిలో ఎంపీడీవో ఆధ్వర్యంలో   జరుగుతుంది. అర్హులైన అభ్యర్థులందరినీ మండల స్థాయిలో ఇంటర్వ్యూ కోసం పిలుస్తారు. వలంటీర్ల నియామకం కోసం పట్టణాలు, మండల స్థాయిలో ముగ్గురు అధికారులతో కమిటీలు నియమిస్తారు. పట్టణాల్లో మున్సిపల్‌ కమిషనర్‌ లేదా డిప్యూటీ కమిషనర్‌ చైర్మన్‌గా, తహసీల్దార్, జిల్లా కలెక్టరు నియమించే మరో అధికారి కమిటీ సభ్యులుగా ఉంటారు. మండల స్థాయి కమిటీలో ఎంపీడీవో చైర్మన్‌గా, తహసీల్దార్, ఈవోపీఆర్‌డీ కమిటీ సభ్యులుగా ఉంటారు.


మండల, పట్టణ స్థాయిలో ఏర్పాటయ్యే ముగ్గురు సభ్యుల కమిటీ అభ్యర్థులకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. ప్రభుత్వ సంక్షేమ పథకాలపై అభ్యర్థికి ఉన్న అవగాహన, సామాజిక పరిస్థితులపై అతనికున్న తెలివితేటలు, అతని నడవడిక, సామాజిక స్పృహ అన్నవి ఇంటర్వూ్యలో ప్రాధాన్యత అంశాలుగా ఉంటాయి. వలంటీర్లగా ఎంపికైన వారి పనితీరు ఆధారంగా ప్రభుత్వం ప్రతి నెలా రూ.5 వేల చొప్పున గౌరవ వేతనం చెల్లిస్తుంది.


ఎంపికైన వారిని విధుల్లో చేర్చుకునే ముందు వారికి ఆరు రోజుల పాటు శిక్షణ ఇస్తారు. గ్రామ–వార్డు వలంటీర్‌ వ్యవస్థ ఉద్దేశం. ప్రభుత్వం అమలు చేసే కార్యక్రమాలపై అవగాహన, విధి నిర్వహణలో వారికి కావాల్సిన కనీస నైపుణ్యాలు, నాయకత్వ లక్షణాలపై శిక్షణ ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: