ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి పోటీగా మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తన తనయుడు నారా లోకేష్ ను ప్రమోట్ చేయాలని ఎన్నికలకు ముందు ఎన్నో ఎత్తులు... పైఎత్తులు వేశారు. జ‌గ‌న్‌కు పోటీగా లోకేష్‌ను ప్రొజెక్ట్ చేసేందుకు చంద్రబాబు పడిన కష్టాలు అన్నీ ఇన్నీ కావు. లోకేష్ ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు దాదాపు పది నియోజకవర్గాలు జల్లెడ పట్టిన చంద్రబాబు... చివరకు లోకేష్‌న్ మంగళగిరి నుంచి పోటీ చేయించారు. మంగళగిరిలో లోకేష్ ఎమ్మెల్యేగా కూడా గెలవలేక పరువు పోగొట్టుకున్నారు.


ఎమ్మెల్యేగా ఓడిన లోకేష్ ఇప్పుడు జగన్ ప్రభుత్వంలో ఓ కీలక పదవి దక్కించుకున్నారు. గుంటూరు జిల్లా పరిషత్‌లో లోకేష్ ఎక్స్ అఫీషియో మెంబ‌ర్‌గా నియ‌మితులు అయ్యారు. రెండేళ్ల క్రితం శాసనమండలికి ఎన్నికైన లోకేష్ ఆ తర్వాత చంద్రబాబు క్యాబినెట్లో మంత్రిగా పని చేశారు. ఈ ఎన్నికలకు ముందు టీడీపీ లో ఎమ్మెల్సీ మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తమ పదవులకు రాజీనామాలు చేసి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. లోకేష్ మాత్రం ఎమ్మెల్సీగా ఉంటూనే ఎమ్మెల్యేగా పోటీ చేసి మంగళగిరిలో ఓడిపోయారు.


దీంతో మరో నాలుగు సంవ‌త్స‌రాల‌ పాటు లోకేష్ కు ఎమ్మెల్సీ గా ఉండే అవకాశం ఉంది. ఎమ్మెల్సీలు ఏదో ఒక అసెంబ్లీ నియోజకవర్గంలో మెంబర్‌గా నమోదయ్యే అవకాశం ప్రభుత్వం కల్పించింది. ఎమ్మెల్సీ ఏ నియోజకవర్గంలో నమోదు అవుతారో... ఆ నియోజకవర్గంలో ఆ ఎమ్మెల్సీకి ప్ర‌భుత్వం ప్రొటోకాల్ కూడా వ‌ర్తింప‌జేయాలి. లోకేష్‌కు మంగ‌ళ‌గిరి నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్సీగా ఉండ‌డంతో మంగళగిరి మున్సిపాలిటీల్లో ఎక్స్‌అఫిషియో మెంబర్‌గా అవకాశం దక్కింది.  


ఈ నేపథ్యంలో లోకేష్‌ గుంటూరు జిల్లా పరిషత్‌లో ఎక్స్‌ అఫిషియో మెంబర్‌గా కొనసాగనున్నారు. లోకేష్ గుంటూరు జిల్లాలో ఎక్స్ అఫిషియో మెంబ‌ర్‌గా ఉండ‌డంతో ఈ నెల 23న జ‌రిగే జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశానికి హాజరుకావాల్సిందిగా జిల్లా పరిషత్ అధికారులు లోకేష్‌కు ఆహ్వానం పంపించారు. ఏదేమైనా లోకేష్ మంగ‌ళ‌గిరిలో ఓడిపోయిన వెంట‌నే అక్కడ దుకాణం స‌ర్దేస్తారిన చాలా మంది భావించారు. లోకేష్ మాత్రం అంద‌రి అంచ‌నాల‌కు భిన్నంగా తాను అక్క‌డే ఉంటాన‌ని.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో అక్క‌డ నుంచే పోటీ చేస్తాన‌ని ప్ర‌క‌టించ‌డంతో పాటు అక్క‌డే ఎమ్మెల్సీగా న‌మోదు అవ్వ‌డం గ‌మ‌నార్హం. లోకేష్‌కు ప్ర‌తిప‌క్ష హోదా కొత్త‌గానే ఉంటుంది.



మరింత సమాచారం తెలుసుకోండి: