వైసీపీ త‌ర‌ఫున ఢిల్లీలో కీల‌క కార్య‌క్ర‌మాలు చ‌క్క‌పెట్ట‌డం కావ‌చ్చు ఇటు ఆన్‌లైన్‌లో అటు ఆఫ్‌లైన్లో ఆయా పార్టీల‌పై ఘాటుగా స్పందించ‌డం స‌హా కీల‌క‌మైన ఆర్థిక సంబంధ‌మైన అంశాల్లోనూ పార్టీ ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డిది కీల‌క పాత్ర‌. పార్టీ నేత‌ల్లో ఎవ‌రైనా అసంతృప్తితో ఉన్న‌ట్లుగా ప‌రిణామాలు చోటు చేసుకున్న త‌రుణంలోనూ విజ‌య‌సాయిరెడ్డి ఎంట్రీ ఇస్తార‌నే టాక్ ఉంది. ఇలా ఇప్ప‌టికే కీల‌క బాధ్య‌త‌ల్లో ఉన్న ఆయ‌న‌కు వైఎస్ జ‌గ‌న్ ప్ర‌భుత్వం త‌ర‌ఫున రెండో కానుక అందించారు. ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధిగా ఆయన్ను నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.


ఇప్ప‌టికే ఇటు పార్టీలో అటు ప్ర‌భుత్వంలో విజ‌య‌సాయిరెడ్డికి కీల‌క బాధ్య‌త‌లు ద‌క్కాయి. ఆంద్రప్రదేశ్‌ ఒలింపిక్‌ అసోసియేషన్ నూతన చైర్మన్‌గా ఎంపీ విజయసాయిరెడ్డిని ఇటీవ‌లే నియ‌మించారు. త‌ద్వారా తొలి నామినేటెడ్ పోస్ట్ క‌ట్ట‌బెట్టారు. అనంత‌రం ఢిల్లీలో పార్టీ ప‌రంగా కీల‌క పోస్టు అయిన పార్ల‌మెంట‌రీ ఫ్లోర్ లీడ‌ర్‌గా విజ‌య‌సాయిరెడ్డికే జ‌గ‌న్ బాధ్య‌త‌లు కేటాయించారు. ఈ రెండు ముఖ్య బాధ్య‌త‌ల‌తో పాటుగా తాజాగా  ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్ర‌భుత్వ‌ ప్రతినిధిగా విజ‌య‌సాయిరెడ్డిని నియమిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రతినిధిగా విజయసాయికి కేబినెట్‌ హోదా కల్పిస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొంది. తక్షణమే ఈ ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.


డిల్లీలో వైసీపీ త‌ర‌ఫున ముఖ్య‌నేత‌గా ఉండ‌ట‌మే కాకుండా...జాతీయ స్థాయిలోనూ విజ‌య‌సాయిరెడ్డి గుర్తింపు సంపాదించారు. ఇటీవ‌ల ప్ర‌ధాన‌మంత్రి స‌మ‌క్షంలో అన్నిపార్టీల‌ అఖిల‌ప‌క్ష స‌మావేశం అనంత‌రం ప్ర‌త్యేకంగా ప్ర‌ధాని మోదీ విజ‌య‌సాయిరెడ్డిని గుర్తించి ``విజ‌య గారు`` అని పల‌క‌రించిన సంగ‌తి తెలిసిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: