ప్ర‌శాంత్ కిశోర్‌...ప‌రిచ‌యం అవ‌స‌రం లేని పేరు. 2014 ఎన్నిక‌ల్లో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ గెలుపు వెనుక ఉన్న కీల‌క శ‌క్తుల్లో ఈయ‌న ఒక‌రు. అయితే వివిధ కార‌ణాల వ‌ల్ల ఆయ‌న బీజేపీకి దూరమ‌య్యారు. అనంత‌రం బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ శతవిధాల ప్రయత్నించినా జేడీయూ నేత నితీశ్‌కుమార్‌ గెలుపొందడానికి దోహదం చేశారు. అలాంటి స‌త్తా గల ప్రశాంత్ కిశోర్ ఆంధ్ర‌ప్రదేశ్‌లో ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ విజ‌యానికి వ్యూహరచన చేశారు. భారీ స్థాయిలో వైసీపీకి విజ‌యం క‌ట్ట‌బెట్టిన ప్ర‌శాంత్‌కిశోర్‌కు ఆఫ‌ర్ల మీద ఆఫ‌ర్లు వ‌స్తున్నాయి. అలా వ‌చ్చిన తాజా ఆఫ‌ర్‌...విల‌క్ష‌ణ న‌టుడు క‌మ‌ల్ పార్టీ గెలుపు కోసం కృషి చేయ‌డం.


జ‌గ‌న్ గెలుపు వెనుక పీకే ఉన్న నేప‌థ్యంలో ఇటీవ‌లే కోల్‌కతాలో తృణ‌మూల్ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షురాలు, రాష్ట్ర సీఎం మమతా బెనర్జీ ప్రశాంత్ కిశోర్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తృణమూల్ కాంగ్రెస్ తరుపున కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఇటీవ‌ల జరిగిన ఎన్నిక‌ల్లో ప‌శ్చిమబెంగాల్లో బీజేపీ స‌త్తా చాటుకొని తృణ‌మూల్ షాకిచ్చిన నేప‌థ్యంలో...న‌ష్ట‌నివార‌ణ చ‌ర్య‌లు చేప‌ట్టిన దీదీ పార్టీకి పున‌ర్వైభ‌వం కోసం ప్ర‌శాంత్ కిశోర్ సేవ‌లు తీసుకుంటున్నారు. ప‌శ్చిమబెంగాల్‌లో పీకే వ్యూహ‌ర‌చ‌న ఎలా ఉంటుంద‌నేది ఆస‌క్తిక‌రంగా మారిన త‌రుణంలో...క‌మ‌ల్ ఎపిసోడ్ తెర‌మీద‌కు వ‌చ్చింది.
చెన్నై  ‘ఆళ్వార్ పేట’లోని పార్టీ కార్యాలయంలో ప్రశాంత్ కిశోర్‌తో క‌మ‌ల్‌హాస‌న్‌ భేటీ అయ్యారని సమాచారం. సార్వత్రిక ఎన్నికల్లో కమల్ హాసన్ పార్టీ ఓటమిపాలైన సంగతి తెలిసిందే. దీనితో కమల్ హాసన్ రాబోయే స్థానిక ఎన్నికల నుంచి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల వరకు పార్టీని ఎలా బలోపేతం చేయాలనే దానిపై ప్రశాంత్ కిశోర్‌తో చర్చ జరిపినట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే పార్టీ కన్నా ముందు కమల్ హాసన్ భేటీ కావడంతో... ఇప్పుడు ఇది తమిళ రాజకీయాల్లో పెద్ద చర్చనీయాంశం అయింది. ఈ విష‌యంలో ఇటు క‌మ‌ల్‌హాస‌న్ అటు ప్ర‌శాంత్ కిశోర్‌, అటు క‌మ‌ల్ హాస‌న్ అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌రించాల్సి ఉంది.
=


మరింత సమాచారం తెలుసుకోండి: