ఏపీ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు చంద్ర‌బాబు నాయుడు చేసిన అవినీతి ప‌ర్వాల్లో మ‌రో అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే అనేకానేక అవినీతి ఆరోప‌ణ‌లు ప్ర‌జ‌ల‌కు స్ప‌ష్ట‌మ‌వుతుండ‌గా...తాజాగా ఇంకో స్కాం వెలుగు చూసింది. ఉండవల్లిలోని ప్రజావేదిక విష‌యంలో సంచ‌ల‌న అంశం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఏపీ ముఖ్య‌మంత్రిగా చంద్ర‌బాబు ఉన్న స‌మ‌యంలో కార్యకర్తలు, ప్రజలతో అందుబాటులో ఉండేందుకు వీలుగా ప్రజావేదికను నిర్మించారు. అయితే, సీఎం పీఠం దిగిన త‌ర్వాత కూడా ఆ వేదిక‌ను త‌మకే  కేటాయించాలని చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి ఇటీవ‌లే లేఖ రాశారు. అయితే, ఏపీ ప్రభుత్వం ఈ వేదిక‌ను స్వాధీనం చేసుకుంది. దీనిపై టీడీపీ నేత‌లు గ‌గ్గోలు పెడుతుండ‌గా...తాజాగా ప‌చ్చ‌త‌మ్ముళ్ల బాగోతం వెలుగులోకి వ‌చ్చింది.

 

ఉండ‌వ‌ల్లి ప్రజావేదిక నిర్మాణంలో అవినీతి జరిగిందని 'సీఆర్‌డీఏ' తేల్చింది. అవినీతి ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలో...గత ప్రభుత్వ హయాంలో ప్రజావేదిక నిర్మాణానికి సంబంధించిన వివరాలను ప్రభుత్వం కోర‌గా...ఈ సీఆర్‌డీఏ నివేదిక ఇచ్చింది. తమ అనుమతి లేకుండానే నిర్మాణం జరిపినట్టు ఆ నివేదికలో సీఆర్‌డీఏ స్పష్టం చేసింది. అంచనాలను తారుమారు చేసినట్టు నివేదికలో వెల్లడించిన సీఆర్‌డీఏ.. రూ. 5 కోట్ల అంచనాలను 8.90 కోట్ల మార్చేసినట్టు పేర్కొంది. కృష్ణానది కరకట్టలో నిర్మాణానికి అనుమతి నిరాకరించినట్లు ఆ నివేదికలో పేర్కొన్న సీఆర్‌డీఏ.. అప్పటి మంత్రి నారాయణ నోటి మాటతో టెండర్లు లేకుండానే పనులు అప్పగించినట్లు తేల్చింది. మున్సిప‌ల్, ప‌ట్టాణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు సీఆర్‌డీఏ అధికారులు నివేదిక అందజేశారు. 

 

అయితే, అమరావతిలోని ప్రజా వేదిక విషయంలో అవినీతి బాగోతాన్ని ప‌క్క‌దోవ ప‌ట్టించేందుకు టీడీపీ ఇంకా ప్ర‌య‌త్నాలు కొన‌సాగుతోంది.  ప్రభుత్వానికి, టీడీపీ మధ్య జగడం కొనసాగుతూనే ఉంది. ప్రజావేదిక విషయంలో ముఖ్యమంత్రి జగన్‌కు తమ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు లేఖ రాశారని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావులు కేశవ్‌ చెప్పారు. కానీ ఆ లేఖపై కనీసం స్పందించలేదని అన్నారు. ఆరు నెలల సమయం అడిగినా ఇవ్వకుండా ఖాళీ చేయించడం సరైన చర్య కాదన్నారు కేశవ్‌. ప్రభుత్వం చేస్తున్న ఈ పని వారి సంస్కారాన్ని తెలియజేస్తుందని అభిప్రాయపడ్డారు.

మరింత సమాచారం తెలుసుకోండి: