పోలవరం ప్రాజెక్టుతో పాటు పట్టణ గృహ నిర్మాణంలో అవినీతిని తొలుత వెలికితీయాలని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌ నిపుణుల కమిటీని ఆదేశించారు. సాగునీటి ప్రాజెక్టుల్లో చోటు చేసుకున్న కుంభకోణాలన్నీ బయటపెట్టాలన్నారు. తొలుత పోలవరం, ఆ తర్వాత హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వంశధార తదితర ప్రాజెక్టులు, నిర్మాణాల్లో అవకతవకలను వెలికితీయాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.

 

దేశం మొత్తం మీద అవినీతిలో ఆంధ్రప్రదేశ్‌ మొదటిస్థానంలో ఉందని గత ప్రభుత్వ హయాంలో పేరొచ్చిందని, దీన్ని మార్చకుండా ఇలాగే వదిలేసే ప్రసక్తే లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో శనివారం ఉదయం కొత్తగా నియమించిన నిపుణుల కమిటీ సభ్యులతో సీఎం సమావేశమయ్యారు.

 

పోలవరం ప్రాజెక్టును గందరగోళం చేశారని జగన్‌ పేర్కొన్నారు. స్పిల్‌ వే పూర్తి కాకుండా కాఫర్‌ డ్యాం నిర్మాణం ప్రారంభించారని, అదీ మధ్యలోనే ఆగిపోయిందన్నారు. దీని వల్ల నాలుగు నెలల పాటు పని చేసుకోవడానికి ఆస్కారం లేకుండా పోయిందన్నారు. తెదేపా ప్రభుత్వ నిర్వాకం వల్లే నాలుగు నెలల పాటు పనులు ఆపేయాల్సిన దుస్థితి వచ్చిందన్నారు.

 

గృహనిర్మాణ రంగంలోనూ అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి జగన్‌ ఈ సమావేశంలో ప్రస్తావించారు. పట్టణ గృహ నిర్మాణంలో చిన్న ప్లాటును రూ.6 లక్షలకు పేదలకు ఇస్తున్నారని, ఇళ్లు కొన్నవారు 20 ఏళ్ల పాటు రుణం భరించాల్సిన పరిస్థితి ఉందన్నారు. చదరపు గజం నిర్మాణానికి రూ.1,000 నుంచి రూ.1,100 వరకు అయ్యేదానికి గత ప్రభుత్వం రూ.2,200 ఖర్చు చేసిందని, తమ ప్రభుత్వంలో అవినీతికి తావు లేదని, టెండర్ల విధానాన్ని అత్యంత పారదర్శకంగా రూపొందించాలని సీఎం అన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: