తెలంగాణ కాంగ్రెస్ షాకిస్తూ, ఆ పార్టీ ముఖ్య‌నేత‌లు బీజేపీ గూటికి చేరేందుకు సిద్ధ‌మ‌య్యారు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరేందుకు ముహూర్తం ఖరారైంది. పీసీసీ పదవి ఇస్తే కాంగ్రెస్‌లో ఉంటాం...లేకుంటే బీజేపీలోకి వెళతామంటూ బాహాటంగానే రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యానించి క‌ల‌క‌లం సృష్టించిన సంగ‌తి తెలిసిందే. పార్టీ వీడనున్న ఆయ‌న సోమవారం ఢిల్లీలో బీజేపీ అధ్యక్షులు అమిత్‌షా లేదా కార్యనిర్వాహక అధ్యక్షులు నడ్డా సమక్షంలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. శనివారం తన నివాసంలో ఆయన అనుచరులు, అభిమానులతో ఆయన సుదీర్ఘంగా చర్చించారు.


ఈ సమావేశానికి మాజీ ఎంపీ రాజయ్య, మాజీ ఎమ్మెల్యే బోడ జనార్థన్‌, ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన కృష్ణారెడ్డిలతో 25 మంది నేతలు హాజరయ్యారు. మొదటి దఫా ఢిల్లీలో రాజగోపాల్‌రెడ్డి ఒక్కరే చేరే అవకాశం ఉందని తెలిసింది. రెండోదఫా మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌ పార్టీ నాయకులు, యువకులు చేరేలా ప్లాన్‌ చేసినట్టు ఆయన సన్నిహితులు చెప్పారు. ఎన్‌ఆర్‌ఐ కాంగ్రెస్‌ విభాగం రాష్ట్ర కన్వీనర్‌ నంగీ దేవేందర్‌రెడ్డి కూడా రాజగోపాల్‌రెడ్డి దారిలో నడిచే అవకాశం ఉందని తెలిసింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో పార్టీ నుంచి సరైన ప్రోత్సహం లేకపోవడం, యువతను ప్రోత్సహించడంతో టీపీసీసీ అధ్యక్షులు ఎన్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వైఫల్యం చెందారని అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. దీంతో ఆయన పార్టీని వీడేందుకు సిద్ధమవుతున్నట్టు కోమటిరెడ్డి అనుచరుడు ఒకరు చెప్పారు.


ఇదిలా ఉండగా కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాత్రం చివరి శ్వాస వరకు కాంగ్రెస్‌లో ఉంటానని ప్రకటించారు. అదేసమయంలో ఢిల్లీలో రాహుల్‌గాంధీ తో ప్రత్యేక భేటీ అయినట్టు, రాష్ట్ర కాంగ్రెస్‌పార్టీ పరిస్థితులపై వివరించినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇవన్నీ పైకి కనిపిస్తున్నా ఎక్కడికి వెళ్లినా కీలక పదవుల కోసమేనన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. అందుకోసం వారు కొన్ని సార్లు ఆ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ పార్టీ నేతల ఆగ్రహానికి గురవుతున్నారు. ఒకవైపు అధికార పార్టీ నుంచి సవాళ్లు ఎదుర్కొంటున్న ఆ పార్టీకి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజగోపాల్‌రెడ్డి ప్రవర్తనలతో విసిగిపోతున్నామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. కొంత మంది కనిపిస్తున్న శత్రువులైతే...మరికొంతమంది అధికార పార్టీకి కోవర్టులుగా ఉంటూ కనిపించని శత్రువులుగా ఉన్నారని ఆ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీ వీహెచ్‌ అంటున్నారు. కోవర్టులే పార్టీని దెబ్బతీస్తున్నారని ఆరోపిస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: