'మాట తప్పను... మడమ తిప్పను.. అని పదేపదే చెప్పే జగన్‌ కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో మాత్రం మాట తప్పి, మడమ తిప్పారు' అని పీసీసీ ఉపాధ్యక్షుడు ఎన్‌.తులసీరెడ్డి విమర్శించారు.

 

కడప జిల్లా వేంపల్లిలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘‘2016 మేలో కర్నూలో జలదీక్ష చేసినప్పుడు కేసీఆర్‌ ప్రభుత్వంపై జగన్‌ ఘాటైన విమర్శలు చేశారు. భవిష్యత్తులో కేసీఆర్‌తో నీటి యుద్ధాలు వస్తాయని అన్నారు.

 

ఆంధ్ర, తెలంగాణ మధ్య ఇండియా, పాకిస్థాన్‌ లాంటి పరిస్థితులు వస్తాయని జగన్‌ వ్యాఖ్యానించారు. ఆయన ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరుకావడం శోచనీయం. ఇదొక దురదృష్టకర సంఘటన. జగన్‌ చెప్పే సుద్దులు కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఏమయ్యాయి. రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను, భవిష్యత్తును తెలంగాణకు, కేసీఆర్‌కు తాకట్టు పెట్టారు.

 

కాళేశ్వరంతోపాటు పాలమూరు-రంగారెడ్డి, దిండి ఎత్తిపోతల పథకాల వల్ల దిగువ రాష్ట్రమైన ఆంధ్ర త్వరలో థార్‌ ఎడారిగా మారుతుంది. అఖండ మెజార్టీతో ఆంధ్ర ప్రజలు సీఎంని చేస్తే ఆ ప్రజలకే నీళ్లు లేకుండా చేయడం శోచనీయం’’ అని తులసీరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: