త‌న‌తో పాటు మ‌రో ముగ్గురు ఎంపీల‌కు కాషాయ‌ కండువా క‌ప్పి తెలుగుదేశం రాజ్యసభ లెజిస్లేచర్ పార్టీని బీజేపీ పార్లమెంటరీ పార్టీలో విలీనమయ్యే ప్రక్రియ పూర్తి అయ్యేలా చేసిన కేంద్ర‌మంత్రి, టీడీఎల్‌పి నాయకుడు సుజనా చౌదరికి ఊహించ‌ని షాక్ త‌గిలింది. సుజనా చౌదరితో పాటుగా సీఎం రమేష్, టీజీ వెంకటేష్, మోహన్‌రావు పార్టీ ఫిరాయించి త‌మ‌ను రాజ్యాంగంలోని 10వ షెడ్యూలులోని 4వ పేరా ప్ర‌కారం బీజేపీలో విలీనం చేయాల‌ని రాజ్యసభ చైర్మన్ వెంక‌య్య‌నాయుడును కోరిన సంగ‌తి తెలిసిందే. తనకు అందజేసిన విలీనం లేఖను రాజ్యసభ సెక్రటరీ జనరల్‌కు పంపించారు. ఈ పత్రాలను పరిశీలించి బీజేపీలో టీడీపీ రాజ్య‌స‌భ‌ప‌క్ష‌ విలీనాన్ని గుర్తించారు. అయితే, ఈ ఎపిసోడ్‌లో చ‌క్రం తిప్పిన సుజ‌నా చౌద‌రికి ఆదిలోనే షాక్ త‌గిలింది.


నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులను బీజేపీలో విలీనం చేయించే క్ర‌మంలో ఆ పార్టీ రాజ్యసభ నాయకుడు సుజ‌నా చౌద‌రి క్రియాశీల‌క పాత్ర పోషించ‌డం వెనుక ముఖ్య కార‌ణం, త‌నపై ఉన్న కేసుల నుంచి విముక్తేన‌ని ప‌లువురు కామెంట్లు చేశారు. తీవ్ర‌మైన ఆర్థిక అభియోగాలు ఉన్న సుజ‌నా చౌదరి వాటి నుంచి త‌ప్పించుకునేందుకే..ఈ నిర్ణ‌యం తీసుకున్నార‌నే ప్ర‌చారం సైతం జ‌రిగింది. అయితే, ఈ విష‌యంలో ఆయ‌న‌కు షాక్ త‌గిలింది. అభియోగాలు ఉండి తమ పార్టీలో చేరుతున్న టీడీపీ ఎంపీలకు తాము ఎటువంటి హామీలు ఇవ్వలేదని, రాజ్యసభలో తమ సంఖ్యాబలం తక్కువగా ఉన్నందునే తెలుగుదేశం సభ్యులను చేర్చుకున్నట్లు భారతీయ జనతా పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు స్పష్టం చేశారు. గుంటూరులోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వారిపై వచ్చిన అభియోగాలపై వారే సమాధానం చెప్తారని, తమ పార్టీలో చేరిన వారికి మంచివారు అని తాము సర్టిఫికేట్లు ఇవ్వలేదన్నారు. గతంలో తాను టీడీపీ రాజ్యసభ సభ్యులను విమర్శించింది నిజమేనని, వారు కూడా తమను విమర్శించారన్నారు. దేశాభివృద్ధిని కాంక్షించే తాము బీజేపీలో చేరినట్లు టీడీపీ సభ్యులు చెప్పారన్నారు. 


బీజేపీలో చేరిన వారు పార్టీ సిద్ధాంతాలు, విధానాలకు లోబడే పనిచేయాలని ప‌రోక్షంగా టీడీపీ ఎంపీల‌కు జీవీఎల్ హెచ్చ‌రిక చేశారు.  గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి చూసే బీజేపీకి ప్రజలు ఓట్లు వేసి 303 స్థానాల్లో బీజేపీకి పట్టం కట్టారన్నారు. 2024 నాటికి మరో 50 స్థానాల్లో విజయం సాధించే దిశగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ పలు పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారన్నారు. అందులో భాగంగా గత ఐదేళ్లలో 9 కోట్ల మందికి మరుగుదొడ్ల నిర్మాణం, 7 కోట్ల మంది మహిళలకు ఉజ్వల పథకం ద్వారా గ్యాస్ కనెక్షన్లు అందజేశామన్నారు. మరో 3 కో ట్ల కుటుంబాలకు దేశవ్యాప్తంగా విద్యుత్ కనెక్షన్లు ఇచ్చిన ఘనత తమదేనన్నారు. రానున్న ఐదేళ్లలో దేశంలోని 14 కోట్ల కుటుంబాలకు నీటి సరఫరా చేసి, 70 కోట్ల మంది ప్రజలకు మంచి చేయాలన్నదే మోదీ లక్ష్యమన్నారు. 2024 నాటికి రాష్ట్రంలో బలీయమైన శక్తిగా బీజేపీ ఎదుగుతుందని జీవీఎల్ ధీమా వ్యక్తం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: