తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఫలితాల అనంతరం రాజకీయ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఫలితాలు ఊహించినట్లుగా రాకపోవడంతో ఆయా పార్టీలకు చెందిన కీలకనేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీలు మారిపోతున్నారు.

 

ఇప్పటికే ఏపీలో ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన ఎంపీలు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే చాలా వరకు జంపింగ్‌లు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో ఇద్దరు మాజీ కేంద్ర మంత్రులు బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు.

 

కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేతలు కమలం గూటికి చేరేందుకు ముహూర్తం ఫిక్స్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా కేంద్ర మాజీ మంత్రులు బలరాం నాయక్‌, సర్వే సత్యనారాయణ బీజేపీతో మంతనాలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. బీజేపీలో చేరేందుకు సర్వే సిద్ధమయ్యారని.. కాంగ్రెస్ ఎమ్మెల్యే, కీలకనేత రాజగోపాల్‌రెడ్డితో పాటు బీజేపీలో చేరే టీమ్‌లో ఆయన ఉన్నారని తెలుస్తోంది.

 

అయితే ఈ చేరికలపై బలరాం నాయక్ మీడియాతో మాట్లాడుతూ.. మమ్మల్ని బీజేపీ నేతలు సంప్రదించిన మాట వాస్తవమేనని స్పష్టం చేశారు. అయితే తాను మాత్రం పార్టీ మారడానికి సిద్ధంగా లేనని.. ప్రాణమున్నంతవరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని బలరాం నాయక్‌ చెప్పుకొచ్చారు.


మరింత సమాచారం తెలుసుకోండి: