ఏపీలో ప్ర‌ధాన విప‌క్షం టీడీపీకి ఇప్ప‌టికే త‌గులుతున్న దెబ్బ‌ల‌కు తోడు మ‌రిన్ని తోడుకానున్నాయ‌ని తెలుస్తోంది. ఇప్ప టికే పార్టీలో కీల‌క‌మైన నాయ‌కులు మూకుమ్మ‌డిగా పార్టీ మారిపోయారు.  దీంతో కేంద్రంలో చ‌క్రం తిప్పుదామ‌ని భావించిన చంద్ర‌బాబుకే దిమ్మ‌తిరిగింది! ఇంత‌లోనే గోరుచుట్టుపై రోక‌లి పోటు మాదిరిగా తాను ఎంత‌గానో ఇష్ట‌ప‌డి క‌ట్టుకున్న సువిశాల ప్ర‌జావేదిక భ‌వ‌నాన్ని ప్ర‌భుత్వం క‌నీసం స‌మాచారం కూడా ఇవ్వ‌కుండానే స్వాధీనం చేసుకుంది. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో ఇప్ప‌టికే చంద్ర‌బాబు అండ్ త‌మ్ముళ్లు ఏం చేయాలో తెలియ‌క స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. అయితే, ఈ అవ‌మానాల ప‌రంప‌ర ఇక్క‌డ‌తో ఆగేలా లేద‌ని తాజా ప‌రిస్థితులు మ‌రింత స్ప‌ష్టం చేస్తున్నాయి. 


గెలిచిన వారు పార్టీలు మారేందుకు చూడ‌డం ష‌రా మామూలే అయితే. తాజా ఎన్నిక‌ల్లో టీడీపీ త‌ర‌ఫున పోటీ చేసి ఓడిపో యిన నాయ‌కులు కూడా ఇప్పుడు పార్టీ మారేందుకు దిక్కులు చూడ‌డ‌మే ఆశ్చ‌ర్యంగా ఉంది. ముఖ్యంగా 2014లో రాజ‌కీ య అరంగేట్రం చేసిన ఎస్సీ సామాజిక వ‌ర్గానికి చెంద‌ని వంగ‌ల‌పూడి అనిత ఆ ఎన్నిక‌ల్లో టీడీపీ టికెట్‌పై విశాఖ జిల్లా పాయ‌క‌రావుపేట నియోజ‌క‌వ‌ర్గం నుంచి విజ‌యం సాధించింది. అదేస‌మ‌యంలో చంద్ర‌బాబు దృష్టిని కూడా ఆమె ఆక‌ర్షించింది. పార్టీలో ఫైర్ బ్రాండ్‌గా ఎదిగే ప్ర‌య‌త్నం చేసింది. ఈ క్ర‌మంలోనే అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యే రోజాతో ఘ‌ర్ష‌ణ‌కు సైతం దిగింది. ఈ నేప‌థ్యంలో అనిత‌కు రాష్ట్ర వ్యాప్తంగా సానుభూతి ప‌వ‌నాలు వీచాయి. 


అయితే, ర‌చ్చ‌గెలిచినా.. తాను ప్రాతినిధ్యం వ‌హించిన పాయ‌క‌రావు పేట‌లో మాత్రం అనిత మంచి మార్కులు సంపా యించు కోలేక పోయింది. టీడీపీలో అంత‌ర్గ‌త కుమ్ములాట‌ను, త‌న‌పై పెరిగిన వ్య‌తిరేక‌త‌ను కూడా అనిత త‌గ్గించ‌లేక పోయారు. ఈ నేప‌థ్యంలో చంద్ర‌బాబు తాజా ఎన్నిక‌ల్లో పాయ‌క‌రావుపేట టికెట్‌ను త‌ప్పించి ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా కొవ్వూరులో కేటాయించారు. నిజానికి టీడీపీకి కంచుకోట అయిన కొవ్వూరులో అనిత గెలుపు న‌ల్లేరుపై న‌డ‌కేన‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఆమె ఘోరంగా ఓడిపోయారు. దీంతో అనిత రాజ‌కీయ వ్య‌వ‌హారం ఏంట‌నే విష‌యంపై నీలి నీడ‌లు కమ్ముకున్నాయి. 


ఓడిపోయినా.. పార్టీలోనే కొన‌సాగేందుకు ఇష్ట‌మే ఉన్నా.. రాజ‌కీయంగా రాష్ట్రంలో మారుతున్న ప‌రిస్థితులు, త‌న‌వి అను కున్న రెండు నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ ఏర్ప‌డుతున్న రాజ‌కీయ ప‌రిణామాల నేప‌థ్యంలో టీడీపీలో ఉంటే అంత సేఫ్ కాద‌ని అనిత భావిస్తున్న‌ట్టు స‌మాచారం. ఈ నేప‌థ్యంలో త్వ‌ర‌లోనే పార్టీ మారాల‌ని ఆమె నిర్ణ‌యించుకున్న‌ట్టు తెలుస్తోంది. ప్ర‌స్తుతం బీజేపీ పార్టీ ఎలాగూ ద్వారాలు తీసే ఉంది. ఇక‌, వైసీపీలోకి వెళ్లేందుకుకూడా అవ‌కాశం ఉంది. తాను ఎలాగూ ఎన్నిక‌ల్లో గెల‌వ‌లేదు కాబ‌ట్టి టీడీపీకి రాజీనామా చేస్తే చాలని అనిత భావిస్తోంది. స‌మీప కాలంలో ఈ రెండు పార్టీల‌కే భ‌విష్య‌త్తు ఉన్న నేప‌థ్యంలో ఇంత‌కు మించిన దారి లేద‌ని వంగ‌ల‌పూడి భావిస్తున్న‌ట్టు స‌మాచారం. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి .


మరింత సమాచారం తెలుసుకోండి: