జగన్ తానూ అవినీతి రహిత పాలనను ఇస్తానని ఇప్పటికే పలు మార్లు చెప్పారు. ఇప్పుడు అదే దిశగా సాగిపోతున్నారు. తాడేపల్లిలోని తన క్యాంప్ కార్యాలయంలో నిపుణుల కమిటీతో సమావేశమైన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. అవినీతి విషయంలో చూసీచూడనట్లు వ్యవహరించాలని, కొన్నాళ్లు కళ్లు మూసుకోవాలని తనకు కొంతమంది ఉచిత సలహా ఇచ్చినట్టు ప్రకటించిన సంచలనం సృష్టించారు. అయితే తనకు ఆ సలహా ఇచ్చిన వ్యక్తుల పేర్లను మాత్రం సీఎం బయటపెట్టలేదు. 


అందర్లా తను కూడా చూసీచూడనట్టు వ్యవహరిస్తే రాష్ట్రం మరింత కష్టాల్లో పడుతుందని, అందుకే అవినీతిని వెలికితీసేందుకు నిపుణుల కమిటీని ఏర్పాటుచేశానని సీఎం ప్రకటించారు. ఆ కమిటీకి విశేష అధికారాల్ని కూడా కట్టబెట్టారు. తొలి ప్రాధాన్యంగా పోలవరం ప్రాజెక్టులో అవినీతిని నిగ్గుతేల్చాలని కమిటీని ఆదేశించారు జగన్. 4 నెలల్లో పోలవరం టెండర్లలో జరిగిన అక్రమాల వివరాలు తనకు తెలియాలని, ఏఏ టెండర్లను మళ్లీ (రివర్స్-టెండరింగ్) పిలవాలో చెప్పాలని సూచించారు. 


పోలవరం ప్రాజెక్టు తర్వాత పట్టణాల్లో నిరుపేదల ఇంటి నిర్మాణాలకు సంబంధించిన ప్రక్రియపై దృష్టిసారించాలని, ఆ తర్వాత హంద్రీనీవా, వంశధార ప్రాజెక్టు పనులపై కన్నేయాలని కమిటీకి ముఖ్యమంత్రి సూచించారు. ఇలా దశలవారీగా ఒక్కో శాఖలో అవినీతి చిట్టాను బయటకు తీయాలని జగన్ నిర్ణయించారు. ఆ తర్వాత సంబంధిత అధికారులు, మంత్రులపై చర్యలు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తారు. దీనితో టీడీపీ అవినీతి భాగోతం ఖచ్చితంగా బయట పడుతుందని అందరూ చెప్పడం గమనార్హం. 

మరింత సమాచారం తెలుసుకోండి: