ఉండవల్లి లోని ప్రజావేదిక నిర్మాణంలోనూ అవినీతి చోటు చేసుకున్నట్లు సీఆర్డీఏ నివేదిక ద్వారా స్పష్టమయింది. ప్రజావేదిక నిర్మాణానికి తొలుత  4 కోట్ల రూపాయలకు టెండర్లు ఖరారు కాగా....నిర్మాణం పూర్తయ్యేసరికి 7 కోట్ల 59 లక్షల రూపాయల ఖర్చయ్యిందని నివేదికలో వెల్లడించారు  . 4 కోట్లకు టెండర్లు పిలిచి, దాదాపు రెట్టింపు మొత్తానికి ప్రజా వేదిక నిర్మాణాన్ని పూర్తి చేయడం వెనుక  పెద్ద మొత్తం లో  అవినీతి చోటు చేసుకున్నట్లు సీఆర్డీఏ అధికారుల  నివేదిక ద్వారా తేటతెల్లం అవుతోంది.


 ఉండవల్లిలోని ప్రజావేదిక నిర్మాణంపై  సీఆర్డీఏ అధికారులు సమర్పించిన  నివేదిక, ప్రస్తుతం  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి టేబుల్ పై ఉంది .  సీఆర్డీఏ నివేదిక పై జగన్మోహన్ రెడ్డి ఎటువంటి నిర్ణయం తీసుకోనున్నారన్నది ఆసక్తికరంగా మారింది .  ప్రజావేదిక నిర్మాణానికైన ఖర్చు,టెండర్ల కేటాయింపు...  తదితర అంశాలపై సీఆర్డీఏ అధికారులు  నివేదికను రూపొందించారు. మొత్తం 15 అంశాలతో కూడిన ఈ నివేదికను సీఆర్డీఏ ప్రభుత్వానికి సమర్పించడం తో,  టీడీపీ ప్రభుత్వ హయం లో జరిగిన అవినీతి వెలుగులోకి రావడం ఖాయమని వైకాపా వర్గాలు అంటున్నాయి.


 ప్రజావేదిక  నిర్మాణానికి  జలవనరుల శాఖ నుంచి ఎలాంటి అనుమతి తీసుకోలేదని, నదీ గరిష్ఠ వరదనీటి మట్టం కన్నా ఈ ప్రాంతం దిగువున ఉన్నందున ప్రజావేదిక నిర్మాణానికి కృష్ణా నదీ సెంట్రల్ డివిజన్ చీఫ్ ఇంజనీరు అనుమతి  నిరాకరించినట్లు సీఆర్డీఏ అధికారులు తమ  నివేదిక  పేర్కొన్నారు. అయినా గత  టీడీపీ ప్రభుత్వం,  ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం పక్కనే ఎటువంటి అనుమతులు లేకుండా ప్రజావేదిక ను నిర్మించి అక్రమాలకు పాల్పడినట్లు నివేదిక ద్వారా స్పష్టం అవుతోంది. కరకట్ట పై చంద్రబాబు నివసించిన అక్రమ  భవనాన్ని కాపాడేందుకే ఎటువంటి అనుమతులు లేకుండానే ప్రజావేదిక ను నిర్మించి  , టీడీపీ ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందన్న విమర్శలు విన్పిస్తున్నాయి.

 

 


మరింత సమాచారం తెలుసుకోండి: