తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి షాకుల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. ఒక‌రి త‌ర్వాత ఒక‌రు అన్న‌ట్లుగా నేత‌లు పార్టీకి గుడ్‌బై చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. తెలంగాణాలో 18 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలలో సరిగ్గా మూడింట రెండువంతులమంది.. అంటే 12 మంది తెరాసలో చేరిపోయారు. పైగా అసెంబ్లీలో తమను తెరాస శాసనా సభాపక్షంలో విలీనమైనట్టుగానే గుర్తించాలని స్పీకర్‌ను అభ్యర్థించగా...ఆయ‌న ఆమోదం తెలిపారు. తాజాగా, మ‌రో ఇద్ద‌రు ముఖ్య‌నేత‌లు పార్టీ మార‌నున్న‌ట్లు ప్రచారం జ‌రుగుతోంది. 


ఏపీలో నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులను చేర్చుకున్న బీజేపీ.. అదే ఊపుతో ఇప్పుడు తెలంగాణపై కన్నేసింది. టీడీపీ, కాంగ్రెస్ పార్టీల్లోని సీనియర్ నేతలను టార్గెట్ చేసింది. ఆయా పార్టీల్లో సీనియర్లుగా ఉండి.. పార్టీ కార్యకలాపాల్లో యాక్టీవ్‌గా లేని నేతలను బీజేపీలో చేర్చుకునేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే పలువురు నేతలతో జరిపిన చర్చలు సక్సెస్‌ అయినట్లు కనిపిస్తోంది. బీజేపీ హైకమాండ్‌తో టచ్‌లో ఉన్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నేడో, రేపో కాషాయ కండువాను కప్పుకునేందుకు సిద్ధమవ‌డ‌మే ఇందుకు తార్కాణం.

ఎవరు వచ్చినా డోర్స్ ఓపెన్ అన్న విధంగా తన ప్రణాళికను నడిపిస్తున్న బీజేపీ తాజాగా కాంగ్రెస్‌లో కేంద్ర మంత్రులుగా పనిచేసిన బలరాం నాయక్, సర్వే సత్యనారాయణలకు గురిపెట్టిన‌ట్లు స‌మాచారం. బీజేపీ సీనియర్లు వీరిద్ద‌రితో మంతనాలు జరిపినట్లు వార్తలు వచ్చాాయి. అయితే తాను బీజేపీలో చేరేందుకు సిద్ధమని వచ్చిన వార్తలను సర్వే సత్యనారాయణ ఖండించారు. రాహుల్ ని ప్రధాని చేయడమే తన లక్ష్యమని చెప్పిన ఆయన.. కావాలనే రాజగోపాల్ రెడ్డి ఇలాంటి వదంతులను రేపుతున్నారని మండిపడ్డారు. తనను బీజేపీ నేతలు ఎవరూ సంప్రదించలేదని ఆయన తెలిపారు. అటు బలరాం నాయక్ కూడా తాను ప్రాణం ఉన్నంత వరకు కాంగ్రెస్‌లోనే కొనసాగుతానని స్పష్టం చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: