తెలంగాణ ముఖ్య‌మంత్రి హోదాలో టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గ‌త రెండేళ్లుగా ప‌ట్టు వ‌ద‌ల‌కుండా ప్ర‌యత్నిస్తున్న అంశం ఏదైనా ఉందా అంటే...అది సెక్ర‌టేరియ‌ట్ నిర్మాణం ఒక్క‌టే. త‌న క‌ల నెర‌వేర్చేందుకు అన్ని ర‌కాలుగా ప్ర‌య‌త్నాలు చేసిన గులాబీ ద‌ళ‌ప‌తి ఈ క్ర‌మంలో కొన్ని ప్ర‌తిఘ‌ట‌న‌ల‌ను సైతం ఎదుర్కున్నారు. ఎట్ట‌కేల‌కు ఆయ‌న స‌చివాల‌య నిర్మాణం కోసం సిద్ధ‌మ‌య్యారు. ఈ క్ర‌మంలో సచివాలయ, శాసనసభ భవనాల శంకుస్థాపనకు తేదీ ఖరారు అయింది. ఈ నెల 27వ తేదీన రెండు భవనాలకు ఒకేరోజు ముఖ్యమంత్రి కేసీఆర్ శంకుస్థాపన చేస్తారు. 

 

ముఖ్యమంత్రి కేసీఆర్ మదిలో సుదీర్ఘకాలంగా మెదులుతున్న కొత్త అసెంబ్లీ, సచివాలయ భవనాల నిర్మాణ ప్రక్రియ ఈనెల 27 వ తేదీ నుంచి వేగవంతం కానుంది. ఈమేరకు మొన్న జరిగిన సమావేశంలో ప్రతిపాదనలు క్యాబినెట్ ఆమోదం కూడా పొందాయి. కొత్త భవనాల నమూనాలు ఎలా ఉండాలనే దానిపై ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నారు. కొత్త అసెంబ్లీ ఎలివేషన్ పాత దాన్ని పోలి ఉండేలా నిర్మించాలని రాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. ఇక కొత్త సచివాలయ భవన నిర్మాణానికి సంబంధించి ముంబైకి చెందిన ఆర్కిటెక్ట్ హఫీజ్ కాంట్రాక్టర్ గతంలో ఇచ్చిన ఓ నమూనాతో పాటు, ఈమధ్యనే చెన్నైకి చెందిన ఆస్కార్ అండ్ పొన్ని ఆర్కిటెక్ట్ సంస్థ ఇచ్చిన మోడల్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ పరిశీలిస్తున్నారు. దీర్ఘ చతరస్రాకారంలో ఒకే బ్లాక్ గా, పొడవుగా ఉండే చెన్నై కంపెనీ ఇచ్చిన భవన ఎలివేషన్ సీఎం కేసీఆర్ ను బాగా ఆకట్టుకుందని అధికారులు అంటున్నారు. ఐతే గతంలో ఇండో అరబిక్ ఆర్కిటెక్చర్ తో హఫీజ్ కాంట్రాక్టర్ ఇచ్చిన నమూనా కూడా ఇంకా ఆయన పరిశీలనలో ఉంది. ఈ రెండింటిలో ఏదో ఒక నమూనాను ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ఖరారు చేస్తారు.

 

 

ఇక క్యాబినెట్ నిర్ణయం మేరకు కొత్త అసెంబ్లీ, సచివాలయం భవనాల నిర్మాణం తాలూకు తీర్మాణం కాపీ రోడ్లు భవనాల శాఖకు చేరింది. సంబంధిత నిర్మాణాల అర్ అండ్ బీ శాఖ నుంచి ఖర్చుల ప్రతిపాదనలు పంపాలని నుంచి ఇంజినీర్ ఇన్ చీఫ్ కార్యాలయానికి సర్క్యులర్ జారీ అయ్యింది. అక్కడి నుంచి వచ్చే ప్రతిపాదనల ఆధారంగా అడ్మినస్ట్రేటివ్ శాంక్షన్ కానీ, బడ్జెట్ రిలీజింగ్ ఆర్డర్ కానీ జారీ చేసే అవకాశాలు ఉన్నాయి. కొత్త సచివాలయం నిర్మాణానికి ₹ 400 కోట్లు, అసెంబ్లీ భవన నిర్మాణానికి ₹ 100 కోట్ల మేరకు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ ప్రక్రియ పూర్తయితే ఆన్ లైన్ గ్లోబల్ టెండర్ ల ద్వారా కానీ, నామినేషన్ విధానంలో కానీ నిర్మాణ సంస్థను ఎంపిక చేసే అవకాశాలు ఉన్నాయి. ఐతే గతంలో అత్యంత వేగంగా రికార్డు సమయంలో ప్రగతి భవన్ నిర్మాణ పనులను పూర్తి చేసిన షాపూర్ జీ - పల్లోం జీ సంస్థకే అసెంబ్లీ, సచివాలయ భవనాల నిర్మాణ బాధ్యతలు అప్పగించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: