ఏపీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశంలో నైరాశ్యం ఆవరించగా.. ఒకే ఒక్క సీటు గెలుచుకున్న జనసేనలో మాత్రం అంతో ఇంతో ఉత్సాహపూరిత వాతావరణం కనిపిస్తోంది. ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా ప్రజల మధ్యనే ఉండాలని పవన్ కల్యాణ్ నిర్ణయించుకోవడం ఆసక్తి రేపుతోంది. 


పార్టీ పరాజయంపై క్షేత్రస్థాయిలో పరిశీలన జరుపుతున్న జనసేనాని త్వరలో భారీ స్కెచ్ తో పార్టీ పునర్నిర్మాణంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా జనసేనలో ముఖ్య కమిటీలు ఏర్పాటు చేయాలని పవన్ కల్యాణ్ నిర్ణయించారు. ఇప్పటికే కమిటీలపై  ఓ అభిప్రాయానికి వచ్చిన పవన్.. సోమవారం నాడు విజయవాడలో ప్రకటిస్తారని తెలిసింది. 

 కొద్ది రోజులుగా కమిటీల  అంశంపై పవన్ కల్యాణ్ విస్తృతంగా సీనియర్ నాయకులతో చర్చలు జరుపుతున్నారు. ఎన్నికల ఫలితాల సమీక్ష, క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన సమాచారం ఆధారంగా కమిటీలకు ఆయన రూప కల్పన చేశారు. అన్ని పార్లమెంట్  స్థానాల పరిధిలో ధృడమైన పార్టీ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 

వచ్చే ఎన్నికలకు ఇప్పటి నుంచే పార్టీ ని సిద్ధం చేసే పనిలో ఉన్న పవన్ కల్యాణ్ పార్టీని గ్రామ స్థాయి నుంచి పరిపుష్టం చేయాలని డిసైడ్ అయ్యారు. అందుకే రాజకీయ వ్యవహారాల కమిటీ, స్థానిక ఎన్నికల కమిటీ, రాజధాని ప్రాంత అభివృద్ధి పరిశీలన కమిటీ, వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పరిశీలన కమిటీ వంటి కమిటీలకు రూపకల్పన చేశారు పవన్ కల్యాణ్.



మరింత సమాచారం తెలుసుకోండి: