తెలుగుదేశంపార్టీలో చంద్రబాబునాయుడే ఒంటరైపోతున్నారా ? వినటానికే విచిత్రంగా ఉన్న జరుగుతున్న పరిణామాలైతే అలాగే అనిపిస్తోంది.  నెల రోజుల క్రితం వరకూ తెలుగుదేశంపార్టీలో చంద్రబాబునాయుడు చెప్పిందే వేదం. కానీ పోయిన నెల 23వ తేదీన వచ్చిన ఎన్నికల ఫలితాలతో పరిస్ధితి దాదాపు తల్లక్రిందులైపోయింది. చంద్రబాబు ప్రస్తుత పరిస్ధితి చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది.

 

మొన్నటి ఎన్నికల్లో టిడిపికి ఘోర ఓటమి ఎదురైనప్పటి నుండి గెలిచిన ఎంఎల్ఏలు కానీ లేకపోతే ఎంపిలు కానీ చంద్రబాబును పెద్దగా లెక్క చేస్తున్నట్లు అనిపించటం లేదు. విజయవాడ ఎంపి కేశినేని నాని పార్టీలో చేస్తున్న రచ్చ అంతా ఇంతా కాదు. స్వయంగా చంద్రబాబు పిలిపించుకుని రెండుసార్లు మాట్లాడిన తర్వాత కూడా రచ్చ చేస్తునే ఉన్నారంటే అర్ధమేంటి ?

 

ఇక ఐదురోజుల పాటు జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో అవినీతి, అధికార దుర్వినియోగం, పార్టీ ఫిరాయింపులు తదితర అంశాలపై చంద్రబాబుపై జగన్మోహన్ రెడ్డితో పాటు మంత్రులు, వైసిపి ఎంఎల్ఏలు దుమ్ము దులిపేశారు. వాళ్ళకు సమాధానం చెప్పటానికి చంద్రబాబుకు నోరే లేవలేదు. అలాంటి సమయంలో వైసిపిని ఎదుర్కొనేందుకు కాస్త ప్రయత్నించింది అచ్చెన్నాయుడు, బుచ్చయ్య చౌదరి మాత్రమే.

 

సభలో టిడిపికి 23 మంది ఎంఎల్ఏలుంటే ఐదురోజుల పాటు చంద్రబాబు తరపున వాదన వినిపించే ప్రయత్నం చేసింది కేవలం ఇద్దరంటే ఇద్దరు ఎంఎల్ఏలు మాత్రమే. మిగిలిన ఎంఎల్ఏలు చంద్రబాబుకు రక్షణగా కనీసం నోరు కూడా విప్పలేదంటే అర్ధమేంటి ?  

 

ఇక తాజాగా రాజ్యసభ ఎంపిల ఫిరాయింపుపై టిడిపి నేతలు ఫిరాయించిన ఎంపిలను అమ్మనాబూతులు తిడుతున్నారు. సరే చంద్రబాబే వాళ్ళని బిజెపిలోకి పంపారనే ప్రచారం కూడా బాగా జరుగుతోంది లేండి. ఇంత హాట్ టాపిక్ విషయంలో కూడా పార్టీ ఎంఎల్ఏలు ఎవరూ ఫిరాయింపులపై మాట్లాడలేదు.  ప్రజావేదికను ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న విషయంలో కూడా విజయవాడకు చెందిన ఇద్దరు,ముగ్గురు టిడిపి నేతలు మాట్లాడారే కానీ ఎంఎల్ఏలెవరూ నోరెత్తలేదు. చూస్తుంటే టిడిపిలో చంద్రబాబు ఒంటరైపోయినట్లే అనిపిస్తోంది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: