ఏపీలో జరిగిన తాజా అసెంబ్లీ ఎన్నికల్లో అనేక చిత్రవిచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఓటమి అనేది లేకుండా వరుస విజయాలు సాధిస్తున్న టీడీపీ కీలక నేతలు అందరూ ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. టోటల్‌గా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ అంతా నవ యువకులతో నిండిపోయింది. తాజా అసెంబ్లీలో ఎక్కువమంది తొలిసారి శాసనసభకు ఎన్నికైన వారే ఉన్నారు. రాజకీయంగా ఎలాంటి అనుభవం లేకపోయినా కూడా టిడిపి మహామహులను ఓడించేశారు. ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటివరకు లేని అరుదైన అంశం ఏపీ అసెంబ్లీ లో ఉంది. ఏకంగా 151 సీట్లు గెలుచుకుని సీఎం అయిన జగన్ చరిత్ర సృష్టించారని చెప్పాలి.


తండ్రి కాంగ్రెస్ నుంచి సీఎం అయితే... కొడుకు కొత్త పార్టీ పెట్టుకుని ఆ పార్టీ నుంచి సీఎం అవ్వడం విశేషం. తండ్రి నుంచి వచ్చిన రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకుని కొత్త పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అవడం తెలుగు రాజకీయాల చరిత్రలో ఒక జగన్మోహ‌న్‌రెడ్డికే సాధ్యం అయింది. ఇక ఓ మాజీ ముఖ్యమంత్రి తనయుడు ముఖ్యమంత్రిగా ఉన్న అసెంబ్లీలో... మరో మాజీ ముఖ్యమంత్రి తనయుడు ప్రతిపక్ష ఎమ్మెల్యే గా ఉండటం విశేషం. ఆ వ్యక్తి ఎవరో కాదు దివంగత మాజీ ముఖ్యమంత్రి, టిడిపి వ్యవస్థాపకులు ఎన్టీఆర్ తనయుడు బాలకృష్ణ. గత ఎన్నికల్లో బాలయ్య అధికార పక్షంలో ఉంటే జగన్ ప్రతిపక్షంలోనూ ఉన్నారు. ఇప్పుడు జగన్ ఏకంగా అధికార పక్షంలో సీఎం అయితే బాలయ్య ప్రతిపక్షంలో ఎమ్మెల్యేగా ఉన్నారు. 


ఒక మాజీ సీఎం తనయుడు సీఎం అయితే... మరో సీఎం తనయుడు రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా కనీసం మంత్రి పదవి కూడా చేపట్టలేదు. ఇక శాసనమండలికి వెళితే అక్కడ మరో మాజీ ముఖ్యమంత్రి వారసుడిగా నారా లోకేష్ స‌భ్యుడిగా ఉన్నారు. టిడిపి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేసిన లోకేష్ ఈ ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి వైసీపీ అభ్యర్థి రామకృష్ణారెడ్డి చేతిలో ఓడిపోయిన సంగతి తెలిసిందే. ఏదేమైనా ఏపీ అసెంబ్లీ, శాసనమండలిలో ముగ్గురు మాజీ ముఖ్యమంత్రుల వార‌సులు సభ్యులుగా ఉండటం విశేషం.


మరింత సమాచారం తెలుసుకోండి: