ఆప‌రేష‌న్ లోట‌స్ దెబ్బ‌తో తెలంగాణ కాంగ్రెస్ గుండుగుత్తుగా ఖాళీ అవుతోంది. ఇప్ప‌టికే చాలా మంది నేత‌లు కాంగ్రెస్ వైపు క్యూక‌డుతున్నారు. ఇక‌, డీకే అరుణ వంటి వారు ఇప్ప‌టికే అక్క‌డ చోటు సంపాయించుకున్నారు. ఈ నేప‌థ్యంలో తాజాగా మ‌రింత మందిపై బీజేపీ నాయ‌కులు క‌న్నేశారు. ఎలాగైనా స‌రే వ‌చ్చే ఎన్నిక‌ల్లో తెలంగాణ‌లో తాము ప్ర‌త్యామ్నాయ శ‌క్తిగా మార‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు. పార్టీలకు చెందిన కీలకనేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీలు మారిపోతున్నారు. 


ఇప్పటికే ఏపీలో ప్రతిపక్ష పార్టీ టీడీపీకి చెందిన ఎంపీలు.. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇప్పటికే చాలా వరకు జంపింగ్‌లు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మరో ఇద్దరు మాజీ కేంద్ర మంత్రులు బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధమయ్యారు. వారు పిలిచారో.. వీరే వెళ్లాల‌ని అనుకున్నారో తెలియ‌దు కానీ, మొత్తానికి చేరిక‌లైతే షురూ అయ్యాయి. బీజేపీ నేత‌లు వ‌రుస పెట్టి ద‌క్షిణాది రాష్ట్రాల్లో ప‌క్కాగా పాగావేయాల‌నినిర్ణ‌యించుకున్న నేప‌థ్యంలో బ‌ల‌హీనంగా ఉన్న పార్టీల నేత‌ల‌ను త‌మ‌వైపు తిప్పు కొనేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు.


ఈ క్ర‌మంలోనే కేంద్ర మాజీ మంత్రులు బలరాం నాయక్‌, సర్వే సత్యనారా యణ బీజేపీతో మంతనాలు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.వీరిద్ద‌రూ కూడా కాంగ్రెస్‌లో కీల‌కంగా చ‌క్రం తిప్పారు. స్థానిక రాజ‌కీయాల్లో గ‌ట్టి ప‌ట్టు కూడా ఉండ‌డం గ‌మ‌నార్హం. సుదీర్ఘ రాజ‌కీయ ప్ర‌స్థానం ఉన్న స‌ర్వే స‌త్య‌నారాయ‌ణ కూడా మంచి ప్ర‌జాబ‌లం ఉన్న ఎస్సీ నాయ‌కుడు. ఇలాంటి వారి ని బీజేపీ గూటికి చేరిస్తే. వ‌చ్చే ఎన్నిక‌ల‌లో దూసుకుపోయే అవ‌కాశం ఉంటుంద‌ని క‌మ‌ల నాథులు భావిస్తున్నారు. 


ఇక‌, కాంగ్రెస్ అధిష్టానం కానీ, రాష్ట్ర నాయ‌క‌త్వం కానీ, తాజాగా జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై మాత్రం ఎక్క‌డ ఒక్క మాట కూడా స్పందించ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. ఇప్ప‌టికే కీల‌క నాయ‌కులపై వ‌ల‌విసిరిన బీజేపీ నాయ‌కులు రాబోయే రోజుల్లో దిగువ‌స్థాయి నేత‌ల‌పైనా దృష్టి పెడితే.. కాంగ్రెస్ మ‌రింత దెబ్బ‌తిన‌డంతోపాటు తెలంగాణాలో అదికారంలోకి వ‌చ్చే ఛాన్స్‌ను కూడా కోల్పోయే అవ‌కాశం ఉంటుంద‌ని హెచ్చ‌రిస్తున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి కాంగ్రెస్ అధిష్టానం ఎలాంటి నిర్ణ‌యం తీసుకుంటుందో చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: