టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగి ఫిరాయింపులను ప్రోత్సహించింది. ఇప్పుడు ఘోర పరాజయాన్ని అనుభవిస్తుంది. తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడిపోయిన ఈ సమయంలో.. అప్పటి కొనుగోళ్లపై స్పందించారు ఆ పార్టీ నేత యనమల రామకృష్ణుడు. 23 మందిని కొన్నప్పటికీ ఉపయోగం జరగలేదన్నారాయన. "ఎమ్మెల్యేలు, ఎంపీల్ని కొనితెచ్చుకోవడం వల్ల పార్టీ బలపడదు. మేం 23 మంది ఎమ్మెల్యేల్ని కొనితెచ్చుకున్నాం. ఇప్పుడేమైంది, ఏకంగా ప్రభుత్వమే పోయింది.


పోవడం కూడా మాములుగా కాదు, భయంకరంగా పోయింది. ఈ 23 మంది మా పార్టీకి ఏం చేయగలిగారు. నేను మొదట్నుంచి చంద్రబాబుకు చెబుతున్నాను. రాజకీయాల్లో ఇలా కొనితెచ్చుకోవడం వల్ల అంతర్గతంగా మరిన్ని సమస్యలు సృష్టిస్తాయి." ఇలా వైసీపీ నుంచి 23 మంది ఎమ్మెల్యేల్ని కొన్నామనే విషయాన్ని బహిరంగంగా అంగీకరించారు యనమల. అప్పుడు తాము చేసిన తప్పునే ఇప్పుడు బీజేపీ చేస్తోందని... ఎమ్మెల్యేల్ని, ఎంపీల్ని కొనుగోలు చేయడం వల్ల ఆ పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదని జోస్యం చెబుతున్నారు.


"అప్పుడు మేం చేసిన పనినే ఇప్పుడు బీజేపీ చేస్తోంది. ఓ జాతీయ పార్టీ అయి ఉండి అది చేస్తోంది అనైతికం. పైగా ఆ పార్టీకి ఎలాంటి ఉపయోగం ఉండదు. రెండో అంశం ఏంటంటే.. ఇలా చేరుతున్న వాళ్లకు ప్రజల్లో బలం ఉంటేనే వాళ్లకు, పార్టీకి ఉపయోగం. ఇలా పార్టీలు మారడం వల్ల ఉపయోగం ఉండదు. పార్టీలు బలపడవు." మొత్తానికి యనమలతో పాటు టీడీపీ నేతలకు ఇన్నాళ్లకు తత్వం బోధపడిందన్నమాట. అంతేకాదు.. పార్టీ మారిన ఎంపీలపై ఫిర్యాదుచేస్తే ఉపయోగం ఉండదనే విషయాన్ని కూడా యనమల ఒప్పుకున్నారు. ఎక్కడైనా స్పీకర్ కే నిర్ణయాధికారం ఉంటుందని, ఈ విషయంలో కోర్టులు కూడా జోక్యం చేసుకోవని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: