వ‌రుస‌ షాకులు ఎదుర్కుంటున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సెట్ చేసేందుకు కాంగ్రెస్‌ హైకమాండ్‌ కసరత్తు మొదలు పెట్టింది. వ‌రుస‌గా ఓట‌ములు, వాటి నుంచి కోలుకుంటున్న త‌రుణంలోనే ఏకంగా 12 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించ‌డ‌మే కాకుండా...త‌మ శాస‌న‌స‌భాప‌క్షాన్ని టీఆర్ఎస్‌లో క‌లిపేయాల‌నే లేఖ ఇవ్వ‌డం...ఇదే స‌మ‌యంలో పార్టీ సీనియ‌ర్ నేత కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి త‌న దారి తాను చూసుకోవ‌డం వంటివి కాంగ్రెస్ ప‌రువును బ‌జారు పాలు చేసేసిన నేప‌థ్యంలో...తెలంగాణలో కొత్త పీసీసీ అధ్యక్షుడిని ఎంపిక చేసేందుకు ఢిల్లీ పెద్ద‌లు క‌స‌ర‌త్తు చేస్తున్నారు.


``రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రస్తుత పరిస్థితి ఏంటి..? ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఒకేసారి ఎందుకు పార్టీ మారారు..? పార్టీ పట్ల విధేయత చూపెడుతోంది ఎవరు.?` వంటి వివరాలను ప్రస్తుత పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ కుమార్ రెడ్డి,  సీఎల్పీ నేత భట్టి విక్రమార్క నుంచి పార్టీ పెద్దలు సేక‌రించారు.  వారం రోజులగా ఢిల్లీలోనే ఉన్న  ఉత్తమ్‌, భట్టి నుంచి అధిష్టానం కీలక వివరాలను సేకరిస్తోంది. రాష్ట్రంలో వచ్చే నాలుగేళ్లపాటు పార్టీని సమర్థంగా నడిపించడం, టీఆర్‌ఎస్‌-బీజేపీని దీటుగా ఎదుర్కోనడంతోపాటు పార్టీకి విధేయులుగా ఉండేవారికి అధ్యక్ష పదవి అప్పగించాలని అధిష్టానం భావిస్తోంది. సీనియార్టీ, స‌మ‌ర్థ‌త స‌హా ఇత‌ర అంశాల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటున్న‌ట్లు స‌మాచారం.

విశ్వ‌సనీయవ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం, కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియ‌ర్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డితోపాటు ఎంపీలు రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి పీసీసీ రేసులో ఉన్నట్టు తెలిసింది. అయితే, వీరిలో శ్రీ‌ధ‌ర్‌బాబుకే ఎక్కువ అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. స‌మ‌ర్థుడు, పార్టీ త‌ర‌ఫున గ‌లం వినిపించే నాయ‌కుడిగా ఆయ‌న‌కున్న నేప‌థ్యాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకోవ‌చ్చ‌ని చెప్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: