తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు నివాసంలో ఆదివారం టీడీపీ నేతలు సమావేశం అయ్యారు. విదేశీ పర్యటనలో ఉన్న చంద్రబాబు ఆయా నాయకులతో ఫోన్ లో మాట్లాడారు. ఈ సందర్భంగా చర్చకు వచ్చిన అంశాలివే... పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనుల గురించి, ఇతర ప్రాజెక్టుల నిర్మాణంపై, రాజధాని నగర నిర్మాణ పనులపై అక్కడేదో అవినీతి జరిగిపోయినట్లుగా సీఎం జగన్మోహన్ రెడ్డి, ఇతర మంత్రులు, వైసీపీ నేతలు మాట్లాడటాన్ని టీడీపీ నేతలు ఖండించారు. కావాలనే ఈ ఆరోపణలన్నీ చేస్తున్నారు తప్ప వీటిలో వాస్తవాలు లేవంటూ ఇవన్నీ మంచిది కాదని, రాష్ట్రానికి మేలు చేకూర్చేవి కాదని అన్నారు.

టీడీఎల్పీ ఉప నేత అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, ‘‘ అక్కడేదో కొండ ఉంది, తవ్వుతానంటున్నావు, తవ్వితే ఎలుక కాదు కదా చీమ, దోమను కూడా పట్టుకోలేవు. మీ ఇష్టం తవ్వుకుంటే తవ్వుకోండి.. ఎక్కడనుంచి తవ్వుతారో అక్కడనుంచి తవ్వండి, ఎంత లోతున తవ్వుతారో అంత లోతున తవ్వండి. తవ్వడానికి గునపాలే దొరకడం లేదన్నట్లుగా మాట్లాడుతున్నారు. నీ గురించి, నీ కేబినెట్ మంత్రులు గతంలో ఏం మాట్లాడారో మా దగ్గర రికార్డులు ఉన్నాయి. వీళ్లందరి చరిత్రలు ఉన్నాయి, ఈ రోజేదో నీతులు మాట్లాడుతున్నారు. గతంలో జగన్ అవినీతిని  విమర్శించిన వాళ్లంతా, ఇప్పుడు జగన్ పక్కన చేరి తామేదో సచ్చీలురు అయినట్లు మాట్లాడుతున్నారు బొత్స సత్యనారాయణ, కన్నబాబు లాంటివాళ్లు.. జగన్ అవినీతి గురించి, వైఎస్ అలవాట్ల గురించి ఇదే బొత్స సత్యనారాయణ గతంలో ఏమన్నారో అందరికీ గుర్తుందని’’ అన్నారు.

కౌన్సిల్ టీడీపీ పక్ష నేత యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ,‘‘ ఢిల్లీ వెళ్లి కేంద్రానికే పోలవరం ఇస్తానన్నారు, విజయవాడ వచ్చి మేమే చేస్తున్నామని  చెప్పారు, పోలవరంపై నెల రోజుల్లోనే అనేక మాటలు మార్చారు. గతంలో అనేక ఆరోపణలు చేసిన మీరే, ఇప్పుడదే అధికారులను బైటపెడితే సన్మానాలు చేస్తానంటున్నారు.. అంటే గతంలో మీరు చేసిన ఆరోపణలన్నీ అవాస్తవాలనే కదా..? అప్పుడా శాఖలో పనిచేసిన అధికారులతోనే ఇప్పుడూ మీరు పని చేయిస్తూ ఏదో తవ్వి తీయాలని అనడం హాస్యాస్పదం’’గా ఉందన్నారు.

కాలువ శ్రీనివాసులు మాట్లాడుతూ, ‘‘తనకున్న బురద టీడీపీకి అంటించడం ద్వారా టీడీపీ, వైసీపీని ఒకే గాట కట్టాలని చూస్తున్నారు. టీడీపీపై అవినీతి ఆరోపణలు చేయడం ద్వారా తనపై అభియోగాలను పలుచన చేసేందుకు జరుపుతున్న జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు నెరవేరవు’’ అన్నారు.

పంచుమర్తి అనూరాధ మాట్లాడుతూ, ‘‘ ప్రజావేదిక కట్టింది మా డబ్బులతో కాదు, మీ డబ్బులతో కాదు, ప్రజాధనంతో అనేది గుర్తుంచుకోవాలి.  ప్రజల నుంచి వినతులు స్వీకరించేందుకే ప్రజావేదిక అడిగాం, లేఖ రాశాం,దానికి జవాబివ్వకుండా, ఏ నిర్ణయం చెప్పకుండా సామాన్లు బైట పడేయడం ప్రధాన ప్రతిపక్ష నాయకుడి పట్ల మర్యాద కాదనే చెప్పాం’’ అంటూ నిన్న బొత్స సత్యనారాయణ చేసిన విమర్శలను తిప్పికొట్టారు.

టీడీపీ అధ్యక్షులు చంద్రబాబు మాట్లాడుతూ, ‘‘ అప్పుడు ఇప్పుడు మాకు రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఆంధ్ర ప్రదేశ్ ప్రయోజనాలే లక్ష్యంగా పనిచేసింది. అవాస్తవ ఆరోపణలతో లేని అవినీతిని టీడీపీకి అంటించాలని చూసినా అది వారికే చుట్టుకుంటుంది. అప్పుడు, ఇప్పుడు ప్రజల పక్షమే తెలుగుదేశం.. ప్రజలతో మరింత దగ్గర అయ్యేందుకు పార్టీ నేతలు పాటుబడాలి. వైసీపీ శ్రేణుల దాడులు, దౌర్జన్యాలకు గురైన కార్యకర్తలకు అండగా ఉండాలి, బాధిత కుటుంబాలను పరామర్శించడంతో పాటుగా, పార్టీ వారికి అన్నివేళలా వెన్నుదన్నుగా ఉంటుందనే భరోసా కల్పించాలి’’ అని కోరారు. ఈ సమావేశంలో వర్ల రామయ్య, టీడీ జనార్దన్, దేవినేని అవినాష్ తదితరులు పాల్గొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: