తెలంగాణ పోలీసుల చిరకాల వాంఛ నెరవేరబోతోంది. ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే ఇక్కడ కూడా పోలీసు సిబ్బందికి వారాంతపు సెలవులిచ్చే అవకాశం కనిపిస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా దీన్నొక విధానంగా అమలు చేయాలనే నిర్ణయం తీసుకోకపోయినప్పటికీ జిల్లాలు, కమిషనరేట్‌ల వారీగా అవకాశాన్ని బట్టి సిబ్బందికి వారాంతపు సెలవులు కల్పించాలనేది అధికారుల ఆలోచన.

 

ప్రస్తుతం తుదిదశలో ఉన్న పోలీసు నియామక ప్రక్రియ పూర్తయి, కొత్త సిబ్బంది విధుల్లో చేరాక వారాంతపు సెలవులను తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులివ్వాలని అధికారులు భావిస్తున్నట్లు సమాచారం. సాధారణంగా డీఎస్పీ ఆపై  అధికారులు వారాంతపు సెలవులు తీసుకుంటుంటారు.

 

క్షేత్రస్థాయిలో విధులు నిర్వర్తించే సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ నుంచి కానిస్టేబుల్‌ వరకూ ఉన్న సిబ్బందికి వారాంతపు సెలవు సాధ్యం కాదు. ఇందుకు కారణాలనేకం చూపిస్తుంటారు. సిబ్బంది సంఖ్య తక్కువగా ఉండటం, దైనందిన విధులు పెరిగిపోవడం వంటి వాటివల్ల క్షేత్రస్థాయిలో పనిచేసే సిబ్బందికి వారాంతపు సెలవులు అమలు చేయడం సాధ్యం కాదని తేల్చేశారు.

 

ప్రస్తుతం రాష్ట్రంలో పోలీసు సిబ్బంది సంఖ్య సుమారు 45 వేలు. హైదరాబాద్‌లో గణేశ ఉత్సవాలకు ఇంచుమించు ఇందులో సగానికిపైగా అంటే 25 వేల మందితో బందోబస్తు ఏర్పాటు చేస్తుంటారు. బోనాలు, ఇతర మతపరమైన ఉత్సవాలకూ బందోబస్తు అవసరం. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా సిబ్బందికి వారాంతపు సెలవులు ప్రకటిస్తే రాజధానిలో పరిస్థితి ఏమిటన్నది ప్రశ్న. అందుకే అవకాశమున్న జిల్లాలు, కమిషనరేట్లలో మాత్రం దీన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: