ఏపీ ముఖ్య‌మంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి సార‌థ్యంలో...నేడు కీల‌క స‌మావేశం జ‌ర‌గ‌నుంది. వైసీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత జ‌రిగే తొలి క‌లెక్ట‌ర్ల స‌మావేశంపై స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. రెండు రోజుల పాటు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నేతృత్వంలో జ‌రిగే తొలి కలెక్టర్ల సమావేశం ఉండవల్లిలోని ప్రజావేదికలో నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన నవరత్నాల హామీల అమలు, ప్రధాన సమస్యల పరిష్కారం, అవినీతి రహిత పారదర్శక సుపరిపాలన ముఖ్యమైన అజెండాగా కలెక్టర్ల సదస్సు జరగనుంది. ప్రజలకు ఇచ్చిన నవరత్నాల అమలు సీఎం తన తొలి ప్రాధాన్యమని క‌లెక్ట‌ర్ల‌కు ఈ స‌మావేశంలో స్ప‌ష్టం చేయ‌నున్నారు.


గతానికి పూర్తి భిన్నంగా కలెక్టర్ల సదస్సును సత్ఫలితాలనిచ్చే చర్చా కేంద్రంగా వినియోగించుకోవాలని సీఎం వైఎస్‌ జగన్‌ నిర్ణయించుకున్నారు. ఉదయం 10 గంటలకు రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్ స్వాగతోపన్యాసంతో కలెక్టర్ల సదస్సు ప్రారంభమవుతుంది. తర్వాత సీఎస్‌ ఎల్వీ సుబ్రహ్మణ్యం కొత్త ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలు, అధికారులు అనుసరించాల్సిన విధివిధానాలపై దిశానిర్దేశం చేస్తారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం, రెవెన్యూ శాఖ మంత్రి పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌ ప్రారంభోపన్యాసం, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ ప్రసంగం ఉంటాయి. అనంతరం సీఎం వైఎస్‌ జగన్‌ కీలకోపన్యాసం ద్వారా ప్రభుత్వ ప్రాధాన్యాలు, అధికారులు ఎలా వ్యవహరించాలనే అంశాలపై దిశానిర్దేశం చేస్తారు. తర్వాత పరిపాలనలో గ్రామ సచివాయాలు, గ్రామ వలంటీర్ల వ్యవస్థ ఎలా ఉండాలన్న అంశంపై పంచాయతీరాజ్, పురపాలక పట్టణాభివృద్ధి శాఖల ముఖ్య కార్యదర్శులు గోపాలకృష్ణ ద్వివేది, శ్యామలరావు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ఇస్తారు. వైద్య రంగంపై వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి, నిత్యావసర సరుకుల డోర్‌ డెలివరీపై ఆ శాఖ కార్యదర్శి కోన శశిధర్, పాఠశాల విద్యపై ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్‌ దాస్, కరవు నేపథ్యంలో తీసుకుంటున్న, తీసుకోవాల్సిన చర్యలపై లైన్‌ డిపార్టుమెంట్ల అధికారులు పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వివరిస్తారు. వీటిపై చర్చ ముగిసిన తర్వాత శాంతిభద్రతలపై కలెక్టర్లు, ఎస్పీల సంయుక్త సమావేశం ఉంటుంది. 


వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తొలి కలెక్టర్ల సదస్సుకే స్పష్టమైన అజెండా ఖరారు చేసింది. అత్యంత ముఖ్యమైన వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో తేవాల్సిన మార్పులు, తీసుకోవాల్సిన చర్యలకు ప్రాధాన్యం ఇచ్చారు. వచ్చే ఉగాది నాటికి 25 లక్షల మంది మహిళలకు ఇంటి స్థల పట్టాలివ్వాలని లక్ష్యంగా పెట్టుకున్న సీఎం ఇందుకు ఏమి చేయాలో దిశానిర్దేశం చేయాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. ఇందులో భాగంగానే రెవెన్యూ శాఖ అధికారులు ఇళ్ల స్థల పట్టాల జారీకి అర్హుల ఎంపిక, విధివిధానాలను ప్రధాన అజెండాగా చేర్చారు. భూ యజమానులకు నష్టం జరగకుండా కౌలు రైతులకు న్యాయం చేస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన హామీ అమల్లో భాగంగా వారికి రుణ అర్హత కార్డుల జారీ, ఇతర చర్యలకు ప్రాధాన్యం ఇవ్వాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు. దీంతో ఈ దిశగా కలెక్టర్లకు దిశానిర్దేశం చేయాలని రెవెన్యూ, వ్యవసాయ శాఖలు ఈ అంశాన్ని ప్రాధాన్య అంశంగా చేర్చాయి. రవు నేపథ్యంలో వ్యవసాయ, పశుసంవర్థక శాఖల్లో తీసుకోవాల్సిన చర్యలు, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి పరిస్థితి, తదితర అన్ని అంశాలను ఆయా శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు/ ముఖ్య కార్యదర్శులు పవర్‌ పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా సదస్సులో వివరించనున్నారు.


కీల‌క‌మైన‌ గ్రామ సచివాలయాలపైనే తొలి చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. గ్రామ సచివాలయాల ఏర్పాటు ద్వారా గ్రామ పంచాయతీల్లో పారదర్శక పాలన అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో ఇందుకు తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశంతోనే కలెక్టర్ల సదస్సులో తొలి చర్చకు శ్రీకారం చుడుతుండటం గమనార్హం.  తెల్ల రేషన్‌కార్డు ఉండి, వైద్య ఖర్చులు రూ.1,000 దాటితే వారిని ఆరోగ్యశ్రీలోకి తీసుకురావడంతోపాటు 104, 108 అంబులెన్సు సేవలను మెరుగుపర్చాలని సీఎం కీలక నిర్ణయం తీసుకున్నందున కలెక్టర్ల సదస్సులో రెండో అంశంగా చేర్చారు. 108, 104 అంబులెన్సుల సేవలను మెరుగుపరుస్తామని ఇచ్చిన హామీ అమలు దిశగా కలెక్టర్లకు దిశానిర్దేశం కోసం అజెండాలో ప్రాధాన్యం కల్పించారు.వర్షాలు ఆరంభమైన నేపథ్యంలో పంటల సాగుకు ప్రభుత్వం అందించాల్సిన సహకారం, సబ్సిడీ విత్తనాలు, ఎరువుల సరఫరా చర్యలను తెలియజేస్తారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: