ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నడుమ సమస్యల పరిష్కారంలో అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే నీటి పంపకాలు, నదీ జలాల సమస్యలపై ఏపీ కొత్త ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం సానుకూలంగా ముందుకెళుతోంది. అయితే విభజన చట్టంలోని అనేక అంశాల్లో సమస్యల నివారణ గత ఏపీ ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా జఠిలంగా మారింది. ఇందులో ఇరు రాష్ట్రాల మధ్య సఖ్యత లేమి ప్రధాన కారణమని కేంద్రం కూడా అభిప్రాయపడింది. అనేక అంశాల్లో ఇరు రాష్ట్రాలు ఏకాభిప్రాయం చూపడంలేదని, అందుకే ఇప్పటికీ ఇంకా సమస్యలు తీరడంలేదని గతంలో కేంద్రం వ్యాఖ్యానించింది. అయితే ఇప్పుడు పరిస్థితిలో మార్పు వచ్చింది. తెలుగు రాష్ట్రాల నడుమ ఇచ్చిపుచ్చుకునే ధోరణి కనిపిస్తోంది. దీంతో పెండింగ్‌ సమస్యలను పరిష్కరించేందుకు ఇదే అనుకూల సమయమని అధికారులు భావిస్తున్నారు. రెండు రాష్ట్రాల అధికార బృందాలు ఈ దిశగా కార్యా చరణ చేపట్టినట్లు తెలిసింది. త్వరలో ఈ దిశగా ఇరు ప్రభుత్వాలు కీలక అడుగు వేయనున్నాయి.

ఆర్థిక అంశాలే కీలకం
ఉమ్మడి జాబితాలోని తొమ్మిది, పదో షెడ్యూల్‌కు చెందిన సంస్థల సమస్యలు, ఆర్థికపరమైన ఆయా అంశాలే ఎక్కువగా పెండింగ్‌లో ఉన్నాయి. వివిధ శాఖల్లోని కేంద్ర నిధులు, పన్నుల వాటా బదలాయింపుల వివాదాలు పరిష్కారం కాలేదు. గతేడాది కేంద్ర ప్రభుత్వం ఇరు రాష్ట్రాల విభజన సమస్యలపై సమగ్ర నివేదికను రూపొందించింది. ఇందులో అనేక జఠిల అంశాలను ప్రస్తావించింది. ఏపీ భవన్‌ విభజన జరగాలని, ఏపీ జెన్‌కోకి విద్యుత్‌ బకాయిలను తెలంగాణ ప్రభుత్వం చెల్లించాలని ఏపీ కోరుతోందని తెలిపింది. పదో షెడ్యూల్‌లోని 45 సంస్థల్లో చరాస్తులు తప్ప నగదు లేదని, వాటిని వెంటనే విభజించాలని కూడా ఏపీ కేంద్రానికి నివేదించింది. షీలాబీడే కమిటీ సిఫార్సుల ఆధారంగా తొమ్మిదో షెడ్యూల్‌లోని 40 సంస్థల విభజన చేపట్టాలని ఏపీ వాదిస్తూ వస్తోంది. నలుగురు ఏపీకి చెందిన అధికారులను ఏపీకి పంపాలని, తెలంగాణకు చెందిన 13 మంది అధికారులను వెనక్కు తీసుకోవాలని తెలంగాణను కోరుతోంది.

చిక్కుముడులు ఎక్కువే
ఇంకా అనేక రంగాల్లో పన్ను బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. ఆర్కియాలజీ, ఆర్చీవ్స్‌లలోని రికార్డులను పంపకాలు తుది దశకు రాలేదు. మ్యూజియాల విభజన చేపట్టాలని ఏపీ గతంలో డిమాండ్‌ చేసింది. అయితే ఇందుకు సుముఖంగా లేని తెలంగాణ హెడ్‌ క్వార్టర్స్‌ ఆస్తుల విభజనపై రెండు రాష్ట్రాల్లో స్పష్టమైన ఒప్పందాలు జరగాలని ఆకాంక్షిస్తోంది. హెడ్‌క్వార్టర్స్‌లోని భూములు కార్పొరేషన్‌ ఆస్తులుగా పరిగణించొద్దని, ప్రధాన కేంద్రం ఎక్కడ ఉంటే ఆ రాష్ట్రానికే నిర్ణయాధికారం ఉంటుందని, ఆస్తుల విలువలను పక్కాగా లెక్కించాలని తెలంగాణ కోరుతోంది. ఏపీలో పనిచేస్తున్న తెలంగాణకు చెందిన నాల్గొ తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారం, ఉపాధ్యాయులు, అధ్యాపకుల పరస్పర బదలీలు, ప్రభుత్వ రంగ సంస్థల్లోని నిధుల విభజన, కార్మిక రుసుముల విభజన కోరుతూ నివేదికను అందించింది. సచివాలయంలో ఏపీకి కేటాయించిన భవనాల విద్యుత్‌, నీటి బిల్లుల చెల్లింపులు తాజాగా రద్దయ్యాయి.

ఈ భవనాలు కూడా తెలంగాణకు అప్పగించారు. అయితే ఏపీపీఎస్సీ విభజన, టీఎస్‌పీఎస్సీకి అదనంగా భవనాలను తెలంగాణ కోరుతోంది. కేంద్రం వివిధ పథకాల కింద ఇచ్చిన రూ. 1621కోట్లలో విదేశీ రుణ చెల్లింపులకు ప్రత్యేకించిన రూ. 478కోట్లలో తెలంగాణ వాటా లెక్క తేలాల్సి ఉంది. ఉమ్మడి ఆబ్కారీ శాఖనుంచి రూ.135కోట్ల తెలంగాణ వాటా పెండింగ్‌లో ఉందని సమాచారం. పోలీస్‌ శాఖలోని డీఎస్పీల విషయంలో హైకోర్టు అనుమతితో తాత్కాలిక కేటాయింపులు చేసుకోవాలని ఇరు రాష్ట్రాలు అంగీకారానికి వచ్చాయి. సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఉపాధ్యాయుల పరస్పర బదలీలను పరిశీలించాలని కూడా గతంలోనే ఏకాభిప్రాయం వచ్చింది.

కేంద్ర మార్గదర్శకాలపైనా సమీక్ష
అదేవిధంగా ఆర్ధికపరమైన అంశాలతోపాటు, 9, 10 షెడ్యూల్‌లోని అంశాలు, సంస్థల విభజన అంశాలు, ఇరు రాష్ట్రాల ఆస్తులు, అప్పుల పంపకాలు, తొమ్మిదో షెడ్యూల్‌లోని ఉమ్మడి సంస్థల పంపకాలపై కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాలను కూడా సమీక్షించాలని డిమాండ్‌ వ్యక్తమవుతోంది. విభజనకు నోచని సంస్థలు, ఉద్యోగుల పంపకాల సమస్యలు, ఆస్తులు, ఇతర సమస్యలను తక్షణం పరిష్కరించాల్సిన అవసరం నెలకొంది. 9వ షెడ్యూల్‌లోని స్థిరాస్తులు లేని 45 సంస్థలు, ప్రభుత్వ భవనాలపై ఏం చేయాలనే నిర్ణయంపౖౖె స్పష్టత రాలేదు. 9వ షెడ్యూల్‌లోని 91 సంస్థల్లో ఇప్పటికే షీలాబీడే కమిటీ 72 సంస్థలపై మార్గదర్శకాలు ఇచ్చింది. కేంద్రం గతేడాది జారీ చేసిన కీలక మార్గదర్శకాలతో 9వ షెడ్యూల్‌లోని 89 ప్రభుత్వ రంగ సంస్థల హెడ్‌ క్వార్టర్స్‌ (ప్రధాన కార్యాలయాలు) మాత్రమే 58:42 నిష్పత్తిలో పంపకాలు చేయాలని తెలంగాణ కోరింది. ఇతర కార్యాలయాలు, వర్క్‌ షాపులు, అథితి గృహాలు, శిక్షణా కేంద్రాలు, ఆస్పత్రుల వంటివి ఏ రాష్ట్రంలో ఉంటే ఆ రాష్ట్రానికే చెందుతాయని కేంద్ర హోంమంత్రిత్వ శాఖ సూచనలు చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: