ఆంధ్రప్రదేశ్‌లో 2004 తర్వాత వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేసేందుకు ఇంకా రూ.38,023 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం నివేదిక సిద్ధం చేసినట్లు సమాచారం. అవసరమైతే పునరావాసం కల్పించడానికి సంబంధించిన లెక్కలు ఇందులో కలిపి ఉన్నదీ లేనిదీ స్పష్టత లేదు.

 

వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉండగా చేపట్టి ఇప్పటికీ పూర్తి కాని వాటిలో 14 ప్రాజెక్టులను పరిగణనలోకి తీసుకుని వేసిన లెక్కలివి. ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే మొత్తం 31.64 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందుతుంది. తొలుత జలయజ్ఞం ప్రాజెక్టులను త్వరితంగా పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది.

 

ఒక వైపు తాజాగా చేపట్టిన ప్రాజెక్టుల్లో అంచనాల పెంపు, నిబంధనల ఉల్లంఘన, టెండర్ల ప్రక్రియలో లోపాలపై నిపుణుల కమిటీతో దర్యాప్తు జరిపిస్తూనే అదే సమయంలో పాత జలయజ్ఞం ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయడానికి చర్యలు తీసుకోవాలనే యోచనలో ప్రభుత్వం ఉంది.

 

పోలవరం, వంశధార రెండో దశ, తోటపల్లి, తారకరామతీర్థ, వెలిగొండ ప్రాజెక్టు, కొరిశపూడి ఎత్తిపోతల, సంగం బ్యారేజి, నెల్లూరు బ్యారేజి, గాలేరునగరి, హంద్రీనీవా తొలిదశ పనులు, గోదావరి, కృష్ణా, ఏలేరు వ్యవస్థల ఆధునికీకరణను నాడు వైఎస్‌ హయాంలోనే ప్రారంభించారు. ఇప్పటికీ ఈ పనులు పూర్తి కాలేదు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టును సాగులోకి తెచ్చేందుకు ఈ ప్రాజెక్టులు ఉపకరిస్తాయని జలవనరులశాఖ అధికారులు చెబుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: