కేబినెట్‌లో చేరిన ఇరువురు మంత్రులకు శాఖల కేటాయింపు తీవ్ర జాప్యం అవుతుండడంతో కాంగ్రెస్‌ నేతలు ఒత్తిడి పెంచారు. ఈనెల 14న కేబినెట్‌ విస్తరణ జరుగగా పది రోజులు కావస్తున్నా శాఖలు కేటాయించలేదు. ఇదే విషయమై ఇరువురు స్వతంత్ర మంత్రులు సీఎం కుమారస్వామిపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

 

మూడు రోజులక్రితమే శాఖలు ప్రకటిస్తానన్న ముఖ్యమంత్రి ‘పల్లె నిద్ర’కు వెళ్ళారు. శాఖల కేటాయింపు జాప్యంపై కాంగ్రెస్‌ మంత్రులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇప్పటికే జేడీఎస్‌ రాష్ట్ర అధ్యక్షుడు విశ్వనాథ్‌ శాఖల కేటాయింపు చేయకపోవడం వారిని అవమానించినట్టేనని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. పదిరోజులు ముగుస్తున్నా ఎటువంటి ప్రక్రియ లేకపోవడంపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

 

ఇరువురు మంత్రులకు నగర పాలక, ఏపీఎంసీ శాఖలు కేటాయించాలని ముఖ్యమంత్రి భావించినా అందుకు వారిరువురూ ససేమిరా అన్నారు. ఖాళీగా ఉండే ప్రాథమిక విద్య, అబ్కారీ, విద్యుత్‌వంటి శాఖలు కేటాయించాలని వారు డిమాండ్‌ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు ఆదివారం ఇరువురు మంత్రులు శంకర్‌, నాగేశ్‌లు సీఎం కుమారస్వామిని కలిశారు.

 

సోమవారం శాఖలు కేటాయిస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు సమాచారం. గవర్నర్‌కు శాఖల కేటాయింపు నివేదికను పంపి అనుమతులు పొందిన తర్వాత బహిరంగ ప్రకటన చేయనున్నారు. ఈ ప్రక్రియ ఎప్పుడు సాగనుందనేది చర్చనీయాంశమైంది. కాగా నాగేశ్‌కు విద్యాశాఖ, శంకర్‌కు నగర పాలక శాఖలు దక్కే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: