``మా నేతలు కాదు కదా, వారి కారు డ్రైవర్లు కూడా జనసేన లో చేరరు`` ఇది టీడీపీ మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా ఓ చానెల్‌తో చెప్పిన మాట‌లు. ఇప్పుడీ వ్యాఖ్య‌లు జ‌న‌సేన పార్టీలో క‌ల‌క‌లం రేపుతున్నాయి. మ‌రోవైపు బోండా ఉమా చేసిన వ్యాఖ్య‌ల‌పై జ‌న‌సేన శ్రేణులు మండిప‌డుతున్నాయి. అస‌లు ఆయ‌న ఎందుకు ఇలాంటి వ్యాఖ్య‌లు చేశారు..? జ‌న‌సేన పార్టీని ఎందుకిలా గంజిలో ఈగ‌లా తీసిప‌డేశారు..? అన్న ప్ర‌శ్న‌ల‌పై ఏపీలో ఆస‌క్తిక‌ర‌మైన చ‌ర్చ జ‌రుగుతోంది. ఇటీవ‌ల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నిక‌ల్లో బోండా ఉమ కేవ‌లం 12 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక మొత్తంగా టీడీపీ దారుణ ప‌రాజ‌యాన్ని చ‌విచూసిన విష‌యం తెలిసిందే. 


అయితే.. ఇప్పుడు జ‌న‌సేన పార్టీపై బోండా ఉమ చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర చ‌ర్చ‌నీయాంశంగా మారుతున్నాయి. ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై జ‌న‌సేన శ్రేణులు మండిప‌డుతున్నాయి. ఎన్నిక‌ల్లో టీడీపీ త‌రుపున పోటీ చేసి ఓడిపోయిన కాపునేత‌లంద‌రూ ఇటీవ‌ల ర‌హ‌స్యంగా స‌మావేశం కావ‌డం, దానిపై అనేక ఊహాగానాలు వినిపించ‌డం, వారంద‌రూ పార్టీని వీడుతున్నార‌నే టాక్ వినిపించ‌డం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో జ్యోతుల నెహ్రూ స్పందిస్తూ.. కేవ‌లం అంత‌ర్గ‌త స‌మావేశమ‌ని, కాపు ఓట్లు కూడా వైసీపీకి ఎలా ప‌డ్డాయ‌న్న కోణంలో చ‌ర్చించామ‌ని, త‌మ సామాజిక ఓట్ల‌ను ఎలా కాపాడుకోవాల‌న్న అంశంపై మాత్రమే మాట్లాడ‌మ‌ని, పార్టీ మారే విష‌యంపై కాద‌ని చెప్పుకొచ్చారు. 


అయితే.. ఈ ఎపిసోడ్ ఇక్క‌డితో ముగిసిపోతుంద‌నుకున్న స‌మ‌యంలో బోండా ఉమా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. టీవీ ఛానల్ కార్యక్రమంలో బోండా ఉమాను ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్న కాపు నేతలు, మాజీ ఎమ్మెల్యేలలో ఎవరైనా జనసేన పార్టీలో లో చేరే ప్రతిపాదన చేశారా అని విలేక‌రి ప్ర‌శ్న అడిగారు. దీనిపై ఆయ‌న స్పందిస్తూ.. ``మా నేతలు కాదు కదా.. వాళ్ల‌ కారు డ్రైవర్లు కూడా జనసేన పార్టీలో చేరరు`` అనేశారు. అయితే.. బోండా ఉమా వ్యూహాత్మకంగానే ఈ వ్యాఖ్య‌లు చేశార‌ని, ఎప్ప‌టికైనా.. వైసీపీకి ప్ర‌త్యామ్నాయం టీడీపీయేన‌ని ప‌లువురు విశ్లేష‌కులు అంటున్నారు. మ‌రోవైపు బోండా ఉమా వ్యాఖ్య‌లపై జ‌న‌సేన శ్రేణులు మండిప‌డుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: