జగన్మోహన్ రెడ్డి నిర్ణయంతో చంద్రబాబునాయుడులో టెన్షన్ పెరిగిపోతోంది. ఎప్పుడైతే ప్రజావేదికను కూల్చేయటానికి  ఆదేశాలిచ్చారో  జగన్ తదుపరి టార్గెట్ ఏమిటి ? అన్న విషయంలో చంద్రబాబుతో పాటు తమ్ముళ్ళలో టెన్షన్ పెరిగిపోతోంది. అక్రమ కట్టటం కాబట్టి కూల్చివేయొద్దని ఎవరూ చెప్పలేరు. అలాగని నిబంధనలకు విరుద్ధంగా కంటిన్యు అవుతుంటే చూస్తు ఊరుకోలేరు.

 

కరకట్టలో చంద్రబాబు నివాసం ఉంటున్న విలాసవంతమైన భవనం ఓ అక్రమ కట్టడం. 2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే కరకట్టపైన నిర్మించిన అక్రమ కట్టడాలన్నింటినీ కూల్చేయబోతున్నట్లు ప్రభుత్వం నోటీసులిచ్చింది. అయితే అందులోని ఓ భవనంపై చంద్రబాబు మనసు పారేసుకోవటంతో  అక్రమ కట్టడాల కూల్చివేతకు బ్రేక్ పడింది.

 

విచిత్రమేమిటంటే తానుంటున్నదే అక్రమ నిర్మాణం అని తెలిసి కూడా తన క్యాంపు ఆఫీసు పక్కనే ప్రభుత్వంతోనే మరో అక్రమ కట్టడం ‘ప్రజావేదిక’ కట్టించారు. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత సీన్ రివర్సయ్యింది. నిజానికి ఎన్నికల్లో ఓడిపోగానే చంద్రబాబు తన భవనాన్ని ఖాళీ చేసేస్తే హుందాగా ఉండేది.

 

అయితే చంద్రబాబు నుండి అటువంటి హుందాతనాన్ని ఆశించలేం. ఎందుకంటే తానుంటున్న క్యాంపాఫీసుతో పాటు ప్రజావేదికను కూడా తనకే కేటాయించాలని చంద్రబాబు కావాలనే లేఖ రాశారు. ఎటూ జగన్ ఒప్పుకోరని తెలుసు. జగన్ కుదరదని చెప్పగానే రాద్దాంతం చేయాలన్నది చంద్రబాబు అండ్ కో ఉద్దేశ్యం. రెండు రోజులుగా తమ్ముళ్ళు చేస్తున్నదదే.

 

మొత్తానికి ప్రజావేదిక కూల్చివేతకు జగన్ ఆదేశాలిచ్చేశారు. మరి తదుపరి టార్గెట్ ఏమిటి ? అంటే చంద్రబాబు నివాసముంటున్నది కూడా అక్రమ కట్టడమే కాబట్టి దాని కూల్చివేతపై జగన్ ఏం నిర్ణయం తీసుకుంటారన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ అది కూడా కూల్చివేయాలని నిర్ణయిస్తే ఇటువంటి అక్రమ కట్టడాలు చాలానే ఉన్నాయి. పైగా అవన్నీ రాజకీయంగా ప్రముఖులవి, సమాజంలో ప్రముఖులు కట్టుకున్నవే కావటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: