సొంత పార్టీలో తమ్ముళ్ళే ఇపుడు నమ్మడంలేదు. అన్న గారి కాలం నుంచి వున్న వారే సైకిల్ దిగిపోయే పరిస్థితి. ఒక్కొక్కరుగా పార్టీని వీడిపోతున్నారు. బాబు ఇవాళ విదేశీ పర్యటన పూర్తి చేసుకుని వస్తున్నారు. ఈ లోగా జరగాల్సింది జరిగిపోతోంది.  


టీడీపీలో సీనియర్ నేతగా ఉన్న అంబికా క్రిష్ణ ఇపుడు బై బై బాబు అనేస్తున్నారు. ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకోవడానికి రెడీ అయిపోతున్నారు. మరో వైపు నలుగురు రాజ్యసభ సభ్యులు వెళ్తే మిగిలిన వారు కూడా సర్దుకునే పనిలో పడ్డారు. ఇదంతా చూస్తూంటే వైసీపీకి రాజకీయ వ్యూహకర్తగా ఉన్న ప్రశాంత్ కిషొర్ ఎన్నికల వేళ అందించిన బై బై బాబు నినాదమే నిజమైపోయెలా ఉంది.  మాకు వద్దు అంటూ వైసీపీ ఎన్నికల వేల నినదిస్తే ఇపుడు తమ్ముళ్ళే బాబుని వద్దు అంటున్నారు. నిజంగా ఇది బాధాకరమే.


ఏపీలో బంపర్ మెజారిటీతో వైసీపీ విజయపతాక ఎగురవేయగా, చంద్రబాబు సారధ్యంలోని టీడీపీ ఎన్నడూ లేని విధంగా 23 సీట్లకే పరిమితమైపోయింది. ఎన్నికల ఫలితాలు వచ్చి దాదాపుగా నెల అవుతోంది. ఈ కాలమంతా చంద్రబాబుకు పెద్దగా పని లేకుండా పోయింది. ఓ విధంగా చెప్పాలంటే ఆయన ఒక్కసారిగా ఖాళీ అయిపోయారు. జగన్ నాయకత్వంలో కొత్త సర్కార్ హామీలను ఒక్కోటిగా నెరవేరుస్తూ ముందుకు సాగుతున్నారు. 


 దూకుడుగా సాగుతున్న జగన్ పాలనలో ఇప్పటికిపుడు తప్పు వెతికి  పట్టుకుందామన్నా దొరకడం లేదు. దాంతో ఎంతో అనుభవం ఉందని చెబుతున్న చంద్రబాబు సైతం మౌనం వహించాల్సివస్తోంది. ఓ విధంగా బాబుకు రాజకీయంగా  పని దొరకడంలేదు, రోజు గడవ‌డంలేదు. పార్టీని ఎలా గాడిన పెట్టాలో కూడా అర్ధం కావడంలేదు. సరిగ్గా ఇదె అదనుగా తమ్ముళ్ళు సైతం బై బై బాబు అనేస్తున్నారు. అటు మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా రెడీ అంటూ వెళ్ళిపోవడానికి క్యూ కడుతూంటే చంద్రబాబుకు బై బై బాబు నినాదమే గుర్తుకొస్తోందట.



మరింత సమాచారం తెలుసుకోండి: