కేంద్రంలో రెండోసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం రైల్వే వ్యవస్థను ప్రయివేటీకరణ చేసే దిశగా అడుగులు వేస్తోందని, దీన్ని అడ్డుకోవడానికి ప్రజాసంఘాలు, కార్మిక సంఘాలు, రాష్ట్ర ప్రజలంతా నడుం బిగించాలని సిఐటియు రాష్ట్రకమిటీ తరఫున కమిటీ ఉపాధ్యక్షులు వి ఉమామహేశ్వరరావు విజ్ఞప్తి చేశారు.

 

విజయవాడ ఎంబి విజ్ఞాన కేంద్రంలో ఆదివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 2019 ఆగష్టు 31లోపు రైల్వే వ్యవస్థను కార్పొరేట్‌ సంస్థలు, విదేశీ పెట్టుబడిదారులకు అప్పజెప్పడానికి కేంద్ర ప్రభుత్వం, రైల్వే మంత్రిత్వశాఖ ద్వారా ఆదేశాలు ఇచ్చిందని స్పష్టం చేశారు.

 

ఇదే జరిగితే ప్రయాణ, రవాణా ఛార్జీల భారం పడుతుందని తెలిపారు. రోజుకు 2కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేస్తూ, లక్షల టన్నుల సరుకును చౌకగా రవాణా చేస్తున్నప్పటికీ రైల్వే ఆదాయం ప్రతి ఏటా పెరుగుతుందని స్పష్టం చేశారు.

 

2018-19 సంవత్సరంలో రైల్వేకు రూ.2.02 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందని వివరించారు. సౌత్‌సెంట్రల్‌ రైల్వే రూ.5వేల కోట్ల ఆదాయాన్ని ఆర్జిస్తుందన్నారు. రైల్వే ఆధీనంలో ఉన్న ఫ్యాక్టరీలు, విభాగాలన్నింటినీ ప్రయివేటు వ్యక్తులకు కట్టబెట్టడానికి బిజెపి తహతహలాడుతుందని విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: