ఆంధ్ర ప్రదేశ్ తో సహా దేశం లోని ఏ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మోడీ సర్కార్ మరో మారు ఖరాఖండిగా తేల్చి చెప్పింది . సోమవారం పార్లమెంట్ సమావేశాల్లో ఈ విషయాన్ని ఆర్ధిక మంత్రి నిర్మలాసీతారామన్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు. దేశం లో ఆంధ్ర ప్రదేశ్ , తెలంగాణ తో సహా మరో ఐదు రాష్ట్రాలు ప్రత్యేక హోదాను కోరుకుంటున్నాయన్న నిర్మలాసీతారామన్ , ఏ ఒక్క రాష్ట్రానికి హోదా ఇచ్చే పరిస్థితి లేదని విస్పష్టం చేశారు .


ఆంధ్ర ప్రదేశ్ ఎన్నికల ఫలితాలు వెలువడగానే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి , ప్రధాని మోడీ తో  ప్రత్యేకంగా భేటీ అయ్యారు . ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాల్సిన అవసరాన్ని గణాంకాలతో సహా వివరించారు . రాష్ర విభజన కారణంగా దండిగా ఆదాయం వచ్చే హైదరాబాద్ ను కోల్పోయి,  ఆంధ్ర ప్రదేశ్ ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటుందని , దాన్ని అధిగమించేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరారు . నీతి ఆయోగ్ సమావేశం లోను తన గళాన్ని విన్పించారు . ఇక ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశం లోను హోదా ఇవ్వండంటూ తీర్మానం చేసి కేంద్రానికి జగన్మోహన్ రెడ్డి నివేదించారు .


 అయినా కేంద్రం వైఖరి లో ఎటువంటి మార్పు కన్పించలేదు . ఆంధ్ర ప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇచ్చేది లేదని మరోమారు స్పష్టం చేసింది. ఏపీ  కి ప్రత్యేక హోదా కాదు ... ప్యాకేజీ ఇస్తామని చెప్పిన మోడీ సర్కార్ దానికి కూడా గతం లో చట్టబద్దత కల్పించకపోవడం వల్లే , టీడీపీ అధినేత చంద్రబాబు , బీజేపీ నాయకత్వ వైఖరి తో విసిగిపోయి , ఆ పార్టీ తో తెగతెంపులు చేసుకున్న విషయం తెల్సిందే .  ప్రస్తుతం మోడీ తో చెలిమి చేస్తోన్న జగన్మోహన్ రెడ్డి , ఆ పార్టీ తీసుకున్న తాజా స్టాండ్ తో  ఎటువంటి  నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి .


మరింత సమాచారం తెలుసుకోండి: