ప్రజాసమస్యలను వినేందుకు ఇకపై ప్రతి సోమవారం అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ గ్రీవెన్స్‌ సెల్‌ నిర్వహించాలని జిల్లాల కలెక్టర్లను ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. దీన్ని కలెక్టరేట్లకు మాత్రమే పరిమితం చేయొద్దని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమానికి ‘స్పందన’ అనే పేరు పెట్టి విస్తృత ప్రచారం కల్పించాలని సూచించారు.

 

ప్రజల నుంచి వినతులు స్వీకరించిన తర్వాత ఆ సమస్యను ఎన్ని రోజుల్లో పరిష్కరిస్తామో వివరిస్తూ వారికి రశీదు ఇవ్వాలని పేర్కొన్నారు. నిర్దేశిత కాల వ్యవధిలోగా సమస్య పరిష్కరించాలని, అన్ని కార్యాలయాల్లోనూ ఇదే పద్ధతి అనుసరించాలని నిర్దేశించారు.త్వరలోనే తాను ‘రచ్చబండ’ కార్యక్రమాన్ని చేపట్టి గ్రామాల్లో పర్యటిస్తానని ప్రకటించారు.

 

‘స్పందన’లో ప్రజలకిచ్చిన రశీదుల్లో పేర్కొన్న వ్యవధిలో ఆ సమస్యను పరిష్కరించారా? లేదా? అనేది రచ్చబండ సందర్భంగా తనిఖీ చేస్తానని చెప్పారు. కలెక్టర్లు కూడా తమ పరిధిలో నెలకోసారి ఇలా తనిఖీ చేయాలన్నారు. కలెక్టర్లు సోమవారం ఎలాంటి సమీక్షా సమావేశాలు నిర్వహించొద్దని, విభాగాధిపతులు, కార్యదర్శులూ ఇదే పద్ధతి పాటించాలని స్పష్టం చేశారు.

 

ప్రభుత్వం ఒక విధానం నిర్ణయించుకున్న తర్వాత ఒక్కొక్కరికి ఒక్కో నిబంధన ఉండకూడదు. తరతమ భేదాలు లేకుండా అందరికీ ఒకే విధానం అమలు కావాలి. అలా కాకుండా ఒక్కరి కోసం నిబంధనలు పక్కదారి పట్టించినా సరే మొత్తం విధానం పక్కదోవ పట్టి విశ్వసనీయత పోతుంది. అని పేర్కొన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: