జగన్ కలెక్టర్ సదస్సులో మాట్లాడుతూ... ప్రజాస్వామ్యంలో ఎమ్మెల్యేలు ఒక కన్ను, .అధికారులు ఒక కన్ను అని, వారిద్దరు కలిసి పనిచేస్తేనే ప్రజలు ప్రభుత్వం మీద పెట్టుకొన్న ఆకాంక్షలు నెరవేరతాయని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి అన్నారు. ‘‘మన ప్రభుత్వమంటే నేను, మీరు కూడా. అంతా ప్రభుత్వంలో భాగస్వాములమే. నాకు అధికారం ఇచ్చింది ప్రజలే. మీమీ స్థానాలూ, అధికారమూ ప్రజలిచ్చినవే. ఇది మర్చిపోకూడదు.

 

కలెక్టర్లుగా బాధ్యతలు చేపట్టేముందు మీరంతా చట్టం, న్యాయం, రాజ్యాంగంపై పూర్తిగా శిక్షణ పొంది ఉంటారు. మీ అందరికీ ఒక విషయం స్పష్టం చేస్తున్నా. ప్రజల ఆకాంక్షల మేరకు ప్రభుత్వం పనిచేయాలి. మనం పాలకులం కాదు...సేవకులం అన్నది ప్రతిక్షణం గుర్తుంచుకోవాలి. నవరత్నాలు మన మేనిఫెస్టో. ఇది ప్రతి కలెక్టర్‌, శాఖాధిపతి, కార్యదర్శి, మంత్రి వద్ద ఉండాలి. దానిలోని ప్రతి అంశాన్నీ ఎట్టి పరిస్థితుల్లోనూ అమలుచేయాలి.

 

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, రైతు, పేద వర్గాలను ఎప్పుడూ మర్చిపోవద్దు. వీరిలో ఎవరిని మర్చిపోయినా మనం తప్పు చేసినట్ల్లేనని కలెక్టర్లు గుర్తుపెట్టుకోవాలి. నవరత్నాల్లోని ప్రతి అంశం వారికందాలి. కులం, మతం, ప్రాంతం, రాజకీయం, పార్టీ...ఇవేవీ చూడొద్దు. ప్రతి ఒక్కరికీ అందాలి. గత ప్రభుత్వం ప్రజలకందే లబ్ధిని రాజకీయంగా చూసింది. నాడు అంతటా అవినీతే.

 

కలెక్టర్లు సహా...జిల్లాలోని ఐఏఎస్‌ అధికారులు వారంలో ఒకరోజు ప్రభుత్వ హాస్టళ్లలో, ప్రభుత్వాసుపత్రుల్లో నిద్రించండి. ఆకస్మికంగా ఆ నిద్రలకు వెళ్లండి. అరగంట ముందు ఫలానా చోటకు వస్తున్నట్టు చెప్పండి. ఐఏఎ్‌సలే అక్కడకు వెళ్లి పడుకున్నప్పుడు అక్కడ వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయో తెలుస్తుంది. ఎమ్మెల్యేలు, ప్రజలు ఎవరొచ్చినా కలెక్టర్లు నవ్వుతూ ఉండాలి. కోల్గెట్‌ ప్రకటనలో నవ్వినట్లు నవ్వాలి. ఉదయం నుంచి సాయంత్రం వరకు చిరునవ్వుతోనే ఉండాలి. అని ఉద్ఘాటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: