ముఖ్య‌నేత‌ల జంపింగ్‌ల‌తో చిగురుటాకుల వ‌ణికిపోతున్న తెలుగుదేశం పార్టీలో కొత్త క‌ల‌కలం తెర‌మీద‌కు వ‌చ్చింది. ఇప్ప‌టికే న‌లుగురు రాజ్య‌సభ స‌భ్యులు తెలుగుదేశం పార్టీ గూటికి చేరి రాజ్య‌స‌భ‌ప‌క్షాన్ని సైతం విలీనం చేసేయ‌గా...పార్టీ ముఖ్య నేత‌, అధినేత చంద్ర‌బాబు స‌న్నిహితుడు అనే పేరున్న మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ  సైతం బీజేపీ కండువా క‌ప్పుకొన్నారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ నేత రాంమాధవ్ సమక్షంలో ఆ పార్టీ కండువా కప్పుకున్నారు. ఏలూరు మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత అంబికా కృష్ణ.. తెలుగుదేశం పార్టీకి గుడ్‌బై చెప్పేయ‌డంతో పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. అయితే, ఈ చేరిక సంద‌ర్భంగా అంబికా కృష్ణ మ‌రిన్ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు.
బీజేపీలో చేరిన అనంతరం అంబికా కృష్ణ‌ మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘోర పరాజయానికి చంద్రబాబునాయుడు తీసుకున్న నిర్ణయాలే కారణమని ఆరోపించారు. ఎన్నికల్లో టీడీపీ కార్యకర్తలు, నాయకులు బ్రహ్మాండంగా పనిచేశారని అన్నారు. కానీ చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలే ఓటమిని తెచ్చాయన్నారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో విభేదాలు, కాంగ్రెస్‌తో కలయిక, దాదాపు 60 మంది సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు మళ్లీ టికెట్లవ్వడం వంటి కారణాల వల్ల ఓటమి తప్పలేదన్నారు.  ఈ విషయాలపై తాను చంద్రబాబుకు ముందే చెప్పినా ఆయన పట్టించుకోలేదన్నారు. టీడీపీని వీడుతున్న విషయాన్ని చంద్రబాబునాయుడికి చెప్పలేదని.. ఆయన అందుబాటులో లేరని తెలిపారు.  ఎమ్మెల్యే బాలకృష్ణకు తెలియజేశానని అంబికా కృష్ణ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.
కాగా, అంబికాకృష్ణ చేసిన వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. చంద్ర‌బాబు విదేశీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న స‌మ‌యంలో పార్టీ ఫిరాయించ‌డ‌మే కాకుండా...త‌న చేరిక చంద్ర‌బాబు బావ‌మ‌రిది, ఎమ్మెల్యే బాల‌కృష్ణ‌కు తెలుసు అనే మాట పార్టీ శ్రేణుల‌ను క‌ల‌వ‌ర‌పాటుకు గురిచేస్తోంది. పార్టీకి చెందిన ముఖ్య నేత ప్ర‌త్య‌ర్థి పార్టీలో చేరుతుంటే...బాల‌య్య బాబు ఎందుకు ఆగ‌లేదు?   పార్టీ భ‌విష్య‌త్తును దెబ్బ‌తీసేలా ఉన్న చేరిక‌ల విష‌యంలో ఎందుకు నంద‌మూరి వార‌సుడు ఇలా స్పందిస్తున్నారు అంటూ పార్టీ శ్రేణులు మ‌థ‌న‌ప‌డుతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: