తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా జూన్ 19న విదేశీ పర్యటనను వెళ్లిన విషయం అందరికి తెలిసిందే. అయితే ఆయన విదేశాల్లో ఉండగా ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ పార్టీకి చెందిన కొందరు ఫిరాయింపులు చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో ఆశక్తికర విషయమేమిటంటే ప్రతిపక్ష నేత చంద్రబాబు ఉంటున్న ఇంటిని, ఆ పక్కనే నిర్మించిన ప్రజావేదికను కూల్పించడంపై సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇవన్ని తెలుసుకున్న చంద్రబాబు మంగళవారం విదేశీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ చేరుకున్నారు.

విదేశీ పర్యటనలో ఉండగానే టీడీపీలో కీలక పరిణామాలు చోటు చేసుకోవడంతో స్వదేశానికి వచ్చాక ఆయన పార్టీ పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారనే అంశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. చంద్రబాబు విదేశీ పర్యటనలో ఉండగానే టీడీపీకి చెందిన నలుగురు రాజ్యసభ్యులు బీజేపీలో చేరడం, టీడీపీ మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ బీజేపీలో చేరడం, తెలంగాణకు చెందిన టీడీపీ నేతలు పెద్దిరెడ్డి, బోడె జనార్థన్ కూడా కమలం పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడంతో చంద్రబాబు ఎలాంటి కీలక నిర్ణయం తీసుకుంటారన్న ఆసక్తి అటు టీడీపీతో పాటు ఇటు రాజకీయ వర్గాల్లో కూడా నెలకొంది.

పార్టీ జంపింగ్‌ల సంగతి పక్కన పెడితే.. ప్రజావేదిక కూల్చివేయాలంటూ సీఎం జగన్ ఇచ్చిన ఆదేశాలపై చంద్రబాబు ఎలా స్పందిస్తారనే అంశం అత్యంత ఉత్కంఠగా మారింది. ఇదే ప్రజావేదికను తమకు కేటాయించాలంటూ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాసిన సంగతి కూడా తెలిసిందే. అయితే.. ఈ నిర్మాణమే అక్రమమంటూ కూల్చివేయాలని వైసీపీ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.

విదేశీ ప్రయాణం ముగించుకొని హైదరాబాద్ కు వచ్చిన చంద్రబాబు ఏమి మాట్లాడలేదు. అయితే ఉండవల్లిలోని ప్రతిపక్ష నేత చంద్రబాబు నివాసం మరియు ప్రజావేదిక కూల్చివేత, పార్టీ సభ్యులు ఫిరాయింపులపై ఆయన ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.


మరింత సమాచారం తెలుసుకోండి: